ఈరోజుల్లో చాగంటి కోటేశ్వరరావు పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలుగు రాష్ట్రాలలో ప్రవచనకర్తగా అందరికీ సుపరిచితులే. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నారు. నిజానికి ఆయన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం కాకినాడ. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14 వ తేదీన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు. ఈయన గురించి అందరికీ ఎలా తెలిసిందంటే.. ఓసారి కాకినాడలో ఒక ప్రవచనం జరుగుతూ ఉంది. అప్పుడు మాతా భాగవతంలో ఒక వ్యాఖ్యాన్ని చెప్పి దీని గురించి ఎవరైనా వివరించగలరా..? అని అడిగారట.
కేవలం ఆ ఒక్కటే కాదు దాని ముందు భాగాన్ని, వెనక భాగాన్ని కూడా ఒక వ్యక్తి లేచి చెప్పేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకి భాగవతం మీద ఉన్న పట్టు చూసి మాత ఆశ్చర్యపోయారు. ఆయనని పిలిచి మీరు సరస్వతి పుత్రులని చెప్పారు. మీలో ఎంతో జ్ఞాన శక్తి ఉందని ఆమె అన్నారు. చాగంటి కోటేశ్వరరావు గురించి మొదట అందరికీ ఇలా తెలిసింది. ఈయన అష్టదశ పురాణాలను అధ్యయనం చేశారు. తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచనాలు చెబుతుంటారు. ఆదిశంకరాచార్య వైభవం, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీ వెంకటాచల వైభవం, సుందరకాండ వంటి 163 అంశాల మీద ప్రవచనాలను అలవోకగా వివరించగల శక్తి సామర్ధ్యాలు చాగంటి కోటేశ్వరరావు సొంతం. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకి చాలామంది వెళుతూ ఉంటారు.
ఆయన చెప్పేది విని జాగ్రత్తగా ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే.. చాగంటి ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారని.. ఈయన ప్రవచనాలు చెప్పి లక్షల రూపాయలు తీసుకుంటారని, అలా కోట్ల రూపాయలను వెనకేసారని పుకార్లు కూడా వచ్చాయి. మరి చాగంటి కోటేశ్వరరావు ఎంత తీసుకుంటారు అనే విషయానికి వస్తే.. ఆయన చెప్పే ప్రవచనాలకి అసలు డబ్బులు తీసుకోరట. ఒకవేళ ఎవరైనా ఆహ్వానిస్తే.. వాళ్ల సంతృప్తి కోసం ఎంతో కొంత తీసుకోమని అంటే ఒక పువ్వుతో పాటు ఒక రూపాయిని ఇవ్వమని అంటారట. అదే తీసుకుంటారు. ఎందుకంటే దేవుడు తనకి సరస్వతీ కటాక్షం ఇచ్చాడని, దానిని అమ్ముకోకూడదని అంటారట. ప్రవచనం చెప్పడం ఆ దేవుడికి సేవ చేసినట్లుగా భావిస్తానని చాగంటి కోటేశ్వరరావు అంటున్నారు.