సినిమాలంటే నాకు పిచ్చిలేదు, అందుకు బాధ కూడా లేదు. అందువల్ల సినిమాని సినిమాలా (ఇది కొందరు విజ్ఞులు చెప్తూ ఉంటారు మనకి) చూడాలి అని కాకుండా, కేవలం నా ఆలోచనలకి అనుగుణంగా ఉంటె తప్ప ఇష్టపడను. ఏముంది ఈ సినిమాలో అని తెలుసుకునే ముందు స్థూలంగా కధ.. పాచు ఉరఫ్ ప్రశాంత్ లౌక్యం పాళ్ళు ఎక్కువ ఉన్న ఒక ముదురు పె.కా.ప్ర. అంటే వెంకీ లా పెళ్లి కాని ప్రసాద్. చాలా లెక్కలు చూసుకుని , పెళ్లి చేసుకుందామనుకునే లోపల వయసు లెక్క మాత్రం పెరిగి అమ్మాయిలు తరిగి పోయే పరిస్థితి అతనిది. పని మీద స్వంత ఊరికి వెళ్లి ఒక పెళ్లి చూపుల్లో తిండి లో చేపముల్లు గొంతులో దిగి, ట్రైన్ ప్రయాణం కేన్సిల్ అవుతుంది. అనుకోకుండా తన షాపు అద్దెకిచ్చిన ఓనర్ తల్లిని ఒక ఐఫోన్ ఆశ వల్ల తనతో ముంబాయికి తీసుకొస్తానని ఒప్పుకుంటాడు. అర్ధరాత్రి గోవా లో ఆమె దిగిపోతే, మధ్యలో పరిచయం అయిన ఒక పిల్ల అయ్యప్ప స్వామి తో తానూ దిగిపోతాడు. ఇక ఆమె అక్కడ ఎందుకు దిగింది అనే దాని వెనుక కధ, ఆమె చెప్పిన పాత కధ విని ఇతను ఎలా అవుతాడు అనేది చూసి తెల్సుకోవాల్సిందే.
దీని డైరెక్టర్ అఖిల్ సత్యన్ కిది తొలిసినిమా అయినా ఆలా అనిపించదు. కధలో మనలాంటి మామూలు మనుషులు , ఎలా ప్రవర్తిస్తారో అలానే సినిమా సాగుతుంది. ముఖ్యంగా ఆరడుగుల జిమ్ కండలు, ముఖానికి పూసిన టన్నుల మేకప్పు పైకప్పు లేవీ లేకుండా, సన్నగా పల్చగా పీలగా ఉండే హీరో, లావుగా (కానీ చక్కగా చూడ ముచ్చటగా) ఉండే హీరోయిన్. ఏమాత్రం ఫార్ములాలకి ,ఈక్వేషన్ లకి అందని ఇలాంటి జోడి చూసి నయా సిని విద్వాన్ శ్రీ శ్రీ శ్రీ పరుచూరి వారేమంటారో. కధలో బలం ఉండాలి. ఉన్నప్పుడు అది బలగం కావచ్చు, పా.అ. విలక్కుమ్ కావచ్చు. జనాలకు నచ్చుతుందని చెప్పడానికి పెద్ద పరిశోధన లేవీ అవసరం లేదు. అందరికీ నచ్చే బాహుబలి ఆర్ ఆర్ ఆర్ లే కాదు, ఇలాంటివీ నచ్చే నా బోటి వారు ఉండి ఉంటారు. అది లేకుండా తీసే చెత్త కన్నా ఇది ఎన్నో రెట్లు మిన్న. సున్నితమైన హాస్యం ,సూక్ష్మమైన (subtle) భావ ప్రదర్సన, నిజ జీవితపు నిఖార్సైన సన్నివేశాలు ఎంత బాగుంటాయో సినిమాలో చూడొచ్చు.
ఫహాద్ ఫాజిల్ నటన బావుండటం లో పెద్ద వింతేమీ లేదు. అతనికి అది అవలీలగా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. బోర్న్ ఆక్టర్ -నటన తో పుట్టినట్టుగా ఉంటుంది. అయితే హీరోయిన్ అంజనా జయప్రకాష్ అతనితో పోటీ పడి నటించింది. అది చాల ఆశ్చర్యంగా ఉంటుంది. డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో తొలిసారి దీన్లో నటించిన బామ్మ విజి వెంకటేష్ కూడా ఏమీ తీసి పోలేదు. పక్కా అవకాశవాది నుంచి, లెక్కలు మరచే మానవత్వం ఉన్న మంచి మనిషిలా మారడంలో పాచు పాత్రలో ఫహాద్ క్రమ పరిణామం అతి సహజంగా కనిపిస్తుంది. మనిషి కేమి కావాలి అసలు? డబ్బేనా? ఇంకేదీ లేదా? ఉంటే , అది తెలుసుకున్న అనుభవం ఎలా ఉంటుంది. వందల మందిని ఒంటి చేత్తో కొట్టి పడేసే వీరత్వం, నడుము మాత్రం అసభ్యంగా ఊపేసే నృత్యం , పొద్దస్తమానం ఎదో వంకతో మందు బాటిల్ ముందర పెట్టుకుని సిట్టింగ్ లో కధ నడిపే అద్భుత దృశ్యాలు, ఇలాంటివి లేక పోతే ముద్ద దిగదు అనుకునే మారాజులకి, ఈ సినిమా అంత నస పంచాంగం ఇంకోటి కనపడక పోవచ్చు.
ఎవరో దారిన పోయే పనిమనిషి చదువు కోసం తపన పడే బామ్మ, తను భర్తతో పాటు చనిపోకుండా ఉండటానికి ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకునే పిచ్చి ఆలోచన, మీకు అసహజంగా అనిపిస్తే అది మీ తప్పు కాదు. మీరు ఈమధ్య చూస్తున్న చౌకబారు సినిమాలది. షాపు అప్పనంగా వస్తుందనుకుని వెళ్తే; అక్కడి పరిస్తితులకి తానే మారిపోయి దెబ్బలు తిని కూడా సరే; ఒక ఆమ్మాయిని కాపాడాలనే ఆలోచన, మనం ఎలానూ చేయలేం. చూసి హర్షించేందుకు అడ్డేమిటి?. తమ్ముడు హఠాత్తుగా మాయమై పోయి, తిరిగిరాక పొతే , తల్లిదండ్రులే సమాధానపడి సగటు మనుషుల్లా వెళ్ళిపోతే, ఆశ చావక అక్కడే ఉద్యోగం చేస్తూ, వాడు వస్తాడని చూసే అక్క మీకు వింతగా కనిపించినా అలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉండకపోరు. ఒక వేళ లేకున్నా హంసధ్వని(హీరోయిన్ పేరు) నటన చూస్తే నిజంగా అక్క బాధ మనసుని కదిలించక మానదు. ఇందులో పాచు పెదనాన్న గా వేసిన వ్యక్తీ సినిమా పేరు ఇన్నోసెంట్,పేరున్న మలయాళ సినీ కమెడియన్ .అయన ఈ మధ్యనే చనిపోయారు. ఇదే ఆఖరి సినిమా. దర్శకుడికి ఇది మొదటి సినిమాయే,కాని నాన్న, అన్న అంతా దర్శకులే. అంటే ఫామిలీ ఫామిలీ, సినీ ఉప్మా తినేసి బతికేసే కుటుంబం (పూరీ సినిమాలో ఇలియానా పై మహేష్ సెటైర్).
ఆడపిల్ల చదువు అనే అంశం తో మొదలైన సినిమా పక్కదార్లు, క్లబ్బు నృత్యాలు, విదేశాల్లో ఎగిరే గంతులు లేకుండా సూటిగా ఒకే ధ్యేయంతో సాగిపోయే సరళమైన సినిమా. అందుకే ఇక్కడిదాకా చదివాక , ఒకటిన్నర గంట టైం పాస్ చేసే ఆలోచన మీకుంటే , అలాంటి సెంటిమెంటల్ దృశ్యాలు మీ హృదయాన్ని కదిలిస్తాయని అనిపిస్తే, వెళ్లి చూడండి. మంచి సినిమాలు ఊరకే రావు, వచ్చినప్పుడు చూసేయాలంతే. కధ చెప్పి, సినిమా చూసి అయినా అర్ధం కాక మళ్ళీ ఎవర్నో అడిగి వంద సార్లు చూసి అబ్బ జబ్బ దబ్బ.. అంటూ, ఇందులో ఇంత ఉందా? అని బోల్డు హాశ్చర్య పడిపోయే మేధావి సినిమా కాదిది. మనలా కనిపించే సాధారణ మనుష్యుల మామూలు కధ. పైగా ప్రైం లో నాలాంటి మలయాళం తెలీని అర్భకుల కోసం తెలుగు డబ్బింగ్ కూడా ఉంది మరి.