సాధారణంగా సినిమాల్లో నటీనటులు వాడిన దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి వేరే సినిమాలకు వినియోగిస్తారు. దీంట్లో రెండు రకాలు. కాస్ట్యూమ్స్ శాఖ వాళ్లకు పాత్రల వివరాలు చెప్పి దుస్తులు తయారు చేయిస్తారు. వాటి ఖర్చు, దర్జీల మజూరీ నిర్మాత భరిస్తారు. ఈ పని ప్రొడక్షన్ శాఖ ద్వారా చేయిస్తారు. చిత్రీకరణ పూర్తి అయ్యాక ప్రొడక్షన్ వారి దగ్గర భద్రపరుస్తారు. ఎడిటింగ్ తర్వాత పాచ్ వర్క్ అవసరమైతే, జాగ్రత్త పెట్టిన దుస్తులను కొనసాగింపు దృష్టితో ఉపయోగిస్తారు. చిత్రం విడుదల అయ్యాక కొందరు నిర్మాతలు వాటిని జాగ్రత్త పెడతారు. భవిష్యత్ చిత్రాల్లో వాడతారు.
తరచూ చిత్రాలు నిర్మించేవారు, వాటిని షో కేస్ లో ఉంచుతారు. లేదా గోడౌన్ లో భద్రపరిచి, మిగిలిన చిత్రాలకు వినియోగిస్తారు. హీరో, హీరోయిన్ లకు వినియోగించినవి తర్వాత చిత్రాల్లో మిగిలిన నటీనటులకు వాడతారు. రెండో విధానంలో.. క్యారెక్టర్ ల పరంగానూ, జూనియర్ ఆర్టిస్టుల పరంగానూ సైజుల వారీగా దుస్తులు సరఫరా చేసే సంస్థలుంటాయి. అద్దె ప్రాతిపదికన అందజేస్తారు.
కొందరు నటీనటులు షూటింగ్ అయ్యాకా ఆ దుస్తులు కావాలని అడుగుతారు. నిర్మాత ఇష్టాఇష్టాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి సందర్భాలు అరుదుగా జరుగుతుంటాయి. ఇవే కాకుండా మరికొన్ని విధానాలు ఉంటాయి.