food

రెస్టారెంట్ల‌లో ల‌భిస్తున్న వెల్లుల్లి కారం కోడి వేపుడు.. ఇంట్లోనే నోరూరించేలా ఇలా చేసుకోండి..!

చాలా మంది చికెన్ తో ప‌లు ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. ఎక్కువ‌గా క‌ర్రీ, ఫ్రై, బిర్యానీ వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా.. ఈ మ‌ధ్య కాలంలో ఒక చికెన్ డిష్ చాలా ఫేమ‌స్‌గా మారింది. అదే వెల్లుల్లి కారం కోడి వేపుడు. చాలా వ‌ర‌కు రెస్టారెంట్ల‌లో ఈ వేపుడును త‌యారు చేసి రుచిగా క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్నారు. దీన్ని సైడ్ డిష్ గా తిన‌వ‌చ్చు. అయితే కాస్త ఓపిక ఉండాలే కానీ రెస్టారెంట్లలో ల‌భించే లాంటి వెల్లుల్లి కారం కోడి వేపుడును ఇంట్లోనే చాలా ఈజీగా త‌యారు చేయ‌వ‌చ‌చు. దీని త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి కారం కోడి వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మారినేషన్ కోసం..

చికెన్ – 500 గ్రాములు (చాలా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, ప‌సుపు – అర టీస్పూన్‌, ఉప్పు – 1 టీస్పూన్ (లేదా రుచికి స‌రిప‌డా), నిమ్మ‌ర‌సం – 1 టేబుల్ స్పూన్‌.

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు – అ టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, క‌రివేపాకులు – 2 రెబ్బ‌లు, ఉల్లిపాయ‌లు – 2 (మీడియం సైజ్‌వి, స‌న్న‌గా త‌ర‌గాలి), వెల్లుల్లి రెబ్బ‌లు – 10 నుంచి 12 (స‌న్న‌గా త‌ర‌గాలి లేదా న‌ల‌పాలి), ప‌చ్చి మిర్చి – 2 లేదా 3, కారం – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – అర టీస్పూన్‌, గ‌రం మ‌సాలా పొడి – పావు టీస్పూన్‌, స‌న్న‌గా త‌రిగిన కొత్తిమీర – పావు క‌ప్పు.

make vellulli karam kodi vepudu like this

త‌యారు చేసే విధానం..

ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్క‌ల‌ను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ప‌సుపు, ఉప్పు, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌ల‌పాలి. చికెన్‌ను క‌నీసం 30 నిమిషాల పాటు మారినేట్ చేయాలి. లేదా ఫ్రిజ్ ఉంటే 1 గంట పాటు మారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక వెడ‌ల్పాటి పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. స్ట‌వ్‌ను మీడియం మంట‌పై పెట్టాలి. ఆవాలు వేసి చిట‌ప‌ట‌లాడించాలి. అందులోనే జీల‌క‌ర్ర‌, క‌రివేపాకులు వేసి ఫ్రై అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. అనంత‌రం త‌రిగిన వెల్లుల్లి ముక్క‌ల‌ను వేయాలి. మ‌ళ్లీ 5 నిమిషాల పాటు వేయించాలి. అందులో మారినేట్ చేయ‌బ‌డిన చికెన్‌ను వేసి బాగా క‌ల‌పాలి. చికెన్‌ను బాగా క‌లుపుతూ ఉడికించాలి. పాన్‌పై మూత పెట్టి చికెన్‌ను 15 నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్ బాగా మెత్త‌గా మృదువుగా మారే వ‌ర‌కు ఉడికించాలి.

అనంత‌రం పాన్‌పై ఉన్న మూత తీసి అందులో కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి బాగా క‌ల‌పాలి. స్ట‌వ్‌ను కాస్త త‌క్కువ చేసి మ‌రో 10 నిమిషాల పాటు బాగా క‌లుపుతూ వేయించాలి. దీంతో అన్ని మ‌సాలాలు, కారం చికెన్ ముక్క‌ల‌కు బాగా ప‌డ‌తాయి. బాగా వేగాక ముక్క‌ల నుంచి నూనె బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్పుడు స‌న్న‌గా త‌రిగి పెట్టుకున్న కొత్తిమీర‌ను వేయాలి. ఉప్పు త‌క్కువైంద‌నుకుంటే కాస్త వేసి క‌లుపుకోవాలి. వేడి ఉన్న‌ప్పుడు వ‌డ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. రోటీ, రైస్‌లోకి వెల్లుల్లి కారం కోడి వేపుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే వెల్లుల్లి రెబ్బ‌ల ఫ్లేవ‌ర్‌, కారం ఇంకా కావాల‌నుకుంటే వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఇంకా వేయ‌వ‌చ్చు. కారం కూడా ఇంకాస్త వేసుకోవ‌చ్చు. దీంతో వేపుడు మ‌రింత స్పైసీగా మారుతుంది. కారం అంటే ఇష్ట‌ప‌డేవారు ఇలా చికెన్ వేపుడును చేస్తే ముక్క‌ల‌ను విడిచిపెట్ట‌కుండా తింటారు.

Admin

Recent Posts