ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో చనిపోయేవారు ఎక్కువయ్యారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉననాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో హార్ట్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మన జీవన శైలిని మెరుగ్గా ఉంచుకుని కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడతాయి. ఆలుగడ్డల్లో పొటాషియం,ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఆలుగడ్డలను తింటే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఆలుగడ్డలను మరీ ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగిపోతారు. విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఆరెంజ్ లు కూడా గుండెజబ్బులను అడ్డుకుంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది.