మార్కెటింగ్ లాంటి ఉద్యోగాలను మినహాయిస్తే ఇప్పుడు దాదాపుగా చాలా వరకు నిత్యం గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలే ఉంటున్నాయి. ఇక పాఠశాలలు, కాలేజీలకు వస్తే అక్కడా గంటల తరబడి కూర్చునే పాఠాలను వింటున్నారు. అవి తప్పితే ఇంటికి రావడం మళ్లీ పుస్తకాలను ముందు వేసుకుని కూర్చోవడం పరిపాటి అయింది. ఈ క్రమంలో రోజూ అలా గంటల తరబడి కూర్చుంటున్న మూలంగా అనేక రకాల అనారోగ్యాలు కూడా సంభవిస్తున్నాయి. పలువురు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా రుజువు చేశారు కూడా.
పాఠశాల వయస్సులో ఉన్న కొందరు విద్యార్థులను, నిత్యం గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్న కొందరు యువతీ యువకులను పలువురు పరిశోధకులు పరిశీలించారు. అనంతరం వారిని నిత్యం కూర్చోకుండా ఉండమని చెప్పి, మళ్లీ వారిని పరిశీలించారు. చివరిగా తెలిసిందేమిటంటే నిత్యం వారు నిలబడి ఉన్నప్పటి కన్నా కూర్చుని ఉన్నప్పుడే వివిధ రకాల అనారోగ్యాలకు గురయ్యేందుకు అవకాశం దాదాపుగా 33 శాతం వరకు ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం 50 శాతం వరకు పెరిగిందట. దీంతో పరిశోధకులు ఏం చెబుతున్నారంటే రోజూ గంటల తరబడి కూర్చుంటే అనేక రకాల అనారోగ్యాలు వస్తాయట.
రోజూ కనీసం 3 గంటల కన్నా ఎక్కువ సేపు కూర్చుంటే దాంతో శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగదట. ఈ కారణంగా గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఎక్కువసేపు కూర్చుని ఉండడం కారణంగా క్లోమ గ్రంథి (పాంక్రియాస్) సరిగ్గా పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుందట. దీంతో డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. నిత్యం గంటల తరబడి కూర్చుని ఉండడం కారణంగా జీర్ణవ్యవస్థ అవయవాలు కుచించుకుపోయి దాని కారణంగా మలబద్దకం, గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు వస్తాయట. అంతేకాదు, పెద్దపేగు క్యాన్సర్ వచ్చేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల మెదడు చురుకుదనం తగ్గిపోతుందట.
వెన్నెముక, కీళ్లకు రక్తం నుంచి పోషకాలు సరిగ్గా అందక అవి త్వరగా క్షీణించే దశకు చేరుకుంటాయట. దీంతో వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందట. అయితే ఎన్ని గంటలు కూర్చుని పనిచేసినా కనీసం గంటకోసారి అయినా లేచి అటు ఇటు తిరగాలని పరిశోధకులు చెబుతున్నారు. గంటకోసారి కనీసం 2 నుంచి 10 నిమిషాల వరకు వాకింగ్ చేయాలని, దీంతో కూర్చుని ఉండడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని వారు అంటున్నారు. దీంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతసేపు వాకింగ్ చేసినా ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. కాబట్టి, మీరు కూడా నిత్యం ఎక్కువ సేపు కూర్చుని ఉంటుంటే కనీసం కొంత సేపైనా లేచి వాకింగ్ చేసేందుకు యత్నించండి. దీంతో భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు.