information

కారు బానెట్‌లోకి ఎలుకలు రాకుండా ఎలా నిరోధించాలి?

నేను బెంగుళూరులో HSR లేఅవుట్‌కు ఇల్లు మారినప్పుడు అక్కడ జనసాంద్రత బాగా తక్కువ. పైగా ఇంటి ఎదురుగా పెద్ద పార్కు. అది చాలక ఇంటి పక్కన ఖాళీ స్థలాలు. ఎలుకలు, పాములు నిత్యదర్శనం. ఎలుకలు కారు బానెట్‌లోకి ఎక్కటం, అక్కడి నుండి ఏసీ వెంట్‌లో చెత్త పేర్చటం జరిగి ఒకానొక రోజు దుర్వాసనకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే వాళ్ళు మొత్తం విప్పదీసి తీసిన చెత్త దాదాపు రెండు కిలోలు – పేపర్లు, ఎముకలు, వగైరా వగైరా. అప్పుడు మొదలైంది వాటిని కారుకు దూరంగా పెట్టే ఉపాయాన్వేషణ.

రోజూ రాత్రి కారు చుట్టూ హిట్ కొట్టాను. వారం రోజులు పని చేసింది. ఎవరో అగరొత్తులు పెడితే ఫలితముంటుందన్నారు. రెండ్రోజులు పనిచేసింది. పనిలోపని సాంబ్రాని కడ్డీ కూడా అయింది. అదీ రెండ్రోజులే. అప్పుడు దొరికింది పవర్‌ఫుల్ ఐడియా – పొగాకు. మామ‌గారితో పల్లె నుండి పొగాకు తెప్పించి రెండాకులను కాస్త నూరి రాత్రి బానెట్‌లో పెట్టటం మొదలెట్టా. అద్భుతంగా పనిచేసింది. అయితే…

what should do to prevent rats coming into car ac inside

ఒకానొక రోజు పొద్దుటే ఆ ఆకులు తీసిపెట్టటం మరచిపోయి కారేసుకెళ్ళిపోయా. ఏసీ వేసినప్పుడు వచ్చిన కంపుకు ఎలుకలపై ప్రేమ పుట్టేసింది. కథ మొదటికి. అప్పటికి రిపెలెంట్ స్ప్రేలు వచ్చాయి. ఒకటి తెప్పించి కొట్టా. దాని ఘాటుకు ఎప్పుడో తగ్గి పోయిందనుకున్న ఆస్త్మా లేచి జూలు విదిల్చింది. చేతులెత్తేశా. అయితే ఇల్లు మారాక అపార్ట్‌మెంట్‌లో మా పార్కింగ్ ప్రదేశానికి ఒకటే ప్రవేశం (గుహలా ఉంటుంది). అడ్డుగా మేకుల పట్టీ పెడుతున్నా. భేషుగ్గా పనిచేస్తోంది… ఇప్పటికి.

Admin

Recent Posts