పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత్.. పాక్‌లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే మౌనంగా ఉంటే తప్పును అంగీకరించాల్సి వస్తుందో అనుకున్నారో లేదో తెలియదు కానీ తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలు లేవని, భారత్ కావాలనే తమ దేశంపై దాడి చేసిందని ఆరోపిస్తూ పాకిస్థాన్ కూడా ఎడా పెడా డ్రోన్లను పంపింది. అలాగే మిస్సైల్స్‌ను కూడా ప్రయోగించింది. కానీ భారత్‌కు చెందిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తోపాటు రష్యా మనకు ఇచ్చిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్‌ను పూర్తిగా తిప్పి కొట్టారు. వాటిని ఆకాశంలోనే ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో మనకు ఎలాంటి నష్టం జరగలేదు.
అయితే ఈ యుద్ధంలో భారత్‌కు చెందిన 5 రాఫెల్ జెట్లను తాము కూల్చామని పాకిస్థాన్ పదే పదే చెబుతోంది. అందుకు సాక్ష్యాలుగా పలు ఫొటోలను కూడా బయట పెట్టింది. కానీ ఆ ఫొటోలను చాలా జాగ్రత్తగా చూస్తే అవి బాగా పాత ఫొటోలు అని తేలింది. పైగా కూలిన రాఫెల్ జెట్లపై ఉన్న జాతీయ జెండా ఇండియాది కాదని, అది ఫ్రాన్స్ జాతీయ జెండా అని, దాన్ని గుర్తించలేని పాకిస్థాన్ తప్పుగా ప్రచారం చేస్తుందని ఇండియా తేల్చి చెప్పింది. అయితే భారత్ కూల్చిన పాకిస్థాన్‌కు చెందిన స్థావరాలు, మిస్సైల్స్, డ్రోన్స్‌ను ఇండియా ఆధారాలతో సహా బయట పెట్టింది. కానీ ఈ విషయంలో పాక్ ఫెయిలైంది. దీంతో పాక్ చెబుతున్నది పూర్తిగా అసత్యమని ప్రపంచం చాలా వరకు నమ్మింది.
అయితే ఓ సమావేశంలో ఇండియన్ ఎయిర్ మార్షల్ మాట్లాడుతూ భారత్‌కు చెందిన రాఫెల్ జెట్లు కూలాయని అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఫైటర్ జెట్లను నడిపిన పైలట్లు మాత్రం సురక్షితంగానే తిరిగి వచ్చారని ఆయన సమాధానం చెప్పారు. కానీ జెట్లు కూలాయా, లేదా, అన్న ప్రశ్నలను ఆయన ఖండించలేదు. అలాగే రాఫెల్ జెట్లను తయారు చేస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ కంపెనీకి చెందిన షేర్లు బాగా పతనం అయ్యాయి. దీంతో రాఫెల్ జెట్లు కూలిపోయి ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పాకిస్థాన్ ఇందుకు కచ్చితమైన ప్రూఫ్‌ను కూడా చూపించలేకపోతోంది. దీంతో ఈ విషయంపై ఇప్పటికీ సందిగ్ధత ఇంకా వీడలేదు. మరి భవిష్యత్తులో అయినా సమాధానం లభిస్తుందో లేదో చూడాలి.