lifestyle

ఊబర్, ఓలా వంటివాటి వల్ల తాము నష్టపోతున్నామని ఆటోవాళ్ళు అంటున్నారు. అయినప్పటికీ చాలామంది ఆటోవాళ్ళు అవే వాడుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటి?

నేను తొమ్మిదవ తరగతి వరకు బడికి వెళ్ళింది రిక్షాలో. అప్పట్లో ఈ రిక్షాలే మా ఊళ్ళో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ఎలాగూ ట్రాఫిక్ బాధ లేదు, జేబుకు చిల్లూ పడదు. కొందరు తమ రిక్షాలను రంగురంగుల జిలుగులతో, డజన్ల కొద్దీ చిరుగంటలతో అలంకరించేవారు. అలాంటి రిక్షాలో వెళ్తుంటే తల అంగుళం పైకి లేచేది, జెయింట్ వీల్ ఎక్కినట్టు, అలౌకికానందంలో! ఆ కాలానికి సహజమైన అమాయకత్వం, తెలియనితనంలో గ్రహించలేదు గానీ నెమ్మదిగా ఆ రిక్షాల మనుగడకు ముప్పు ఈ రూపంలో వచ్చింది. రిక్షాలో 2 రుపాయల ప్రయాణం ఆటోలో అయిదు రుపాయలయింది. ఎండ, వాన నుండి కాస్త రక్షణనిచ్చేవి కావటంతో భరించగలిగిన వారు రిక్షాలు వదిలి ఆటోరిక్షాలను పట్టుకున్నారు.

అయితే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలా ఆటో కూడా అవసరమైన విలాసం అయిపోటానికి ఎక్కువ సమయం పట్టలేదు. నన్ను బడికి తీసుకెళ్ళే తాత రిక్షా అమ్మేసి పల్లెకు వెళ్ళిపోయాడు. గిరాకీ పెరిగింది. ఆటోరిక్షాల గుత్తాధిపత్యం మొదలైంది. పది రుపాయల ప్రయాణానికి ఇరవై, ఇరవైకి ముప్పై, ముప్పైకి యాభై… ఆశకు హద్దులు పెరుగుతూ మొత్తానికి మాయమయ్యాయి. వేరే ఎంపిక లేక, దరి దారి కానరాక వారి డిమాండుకు తలొగ్గాల్సి వచ్చేది. బెంగుళూరు వంటి నగరాల్లో మీటర్ కేవలం అలంకారప్రాయంగా మిగిలి, 3-4 రెట్లు ఎక్కువ కిరాయి గుంజటం పరిపాటి అయింది.

auto drivers say they lose because of ola and uber

సుమారు మూడు దశాబ్దాల గుత్తాధిపత్యం, దోపిడీ తరువాత ఆ దోపిడీకి ఈ రూపంలో ముప్పు మొదలైంది. ఏసీతో మరింత సౌకర్యవంతం, బుక్ చేసుకోవటం సరళం. అయితే, ఆటోలు కావరంతో పట్టించుకోనిది, ఈ క్యాబు వ్యవస్థ అందించినది ఒక ముఖ్యమైన సౌలభ్యం – ఫీడ్‌బ్యాక్ – ప్రయాణికులతో సౌమ్యంగా ప్రవర్తించే వారే డ్రైవర్లుగా మనగలిగే నియమం. పైగా (మొదట్లో) ఆటోలు దబాయించే రెట్టింపు కిరాయికే కారు లభ్యమయేది. మునుపు రిక్షాలకు జరిగింది అన్యాయం అయితే ఈసారి ఆటోలకు జరిగిందీ అన్యాయమేనా? ఈ చేత చేసి ఆ చేత అనుభవించినట్టు. వేరే దారి, దిక్కు లేక. స్వయంకృతాపరాధం.

Admin

Recent Posts