వైద్య విజ్ఞానం

ఏ వ‌యస్సులో ఉన్న‌వారికి ఎంత నిద్ర అవ‌స‌రం అంటే..?

నిద్ర బంగారం. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. ఇది కొరవడకుండా చూసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. మున్ముందు జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. చురుకుదనం, పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించేలా చేస్తుంది. మొత్తంగా శారీరక, మానసిక, సామాజిక ఉన్నతికి తోడ్పడుతుంది. ఎంత నిద్ర అవసరమనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. కొందరికి 4 గంటల నిద్రే సరిపోవచ్చు. కొందరికి 9 గంటలు అవసరమవ్వచ్చు. చాలామందికి 7-8 గంటలు సరిపోతుందని చెప్పుకోవచ్చు. వయసు మీద పడుతున్నకొద్దీ దీని అవసరం తగ్గుతూ వస్తుంది. శిశువులకు 14-18 గంటల నిద్ర కావాలి. అదే నాలుగైదేళ్ల పిల్లలకు 11-12 గంటలు అవసరం. టీనేజీలో (13-19 ఏళ్ల వయసు) 8-9 గంటలు నిద్ర అవసరం.

ఇప్పుడు చదువుల ఒత్తిడి పిల్లల్లో నిద్రను బాగా దెబ్బతీస్తుండటం ఆందోళనకరం. పరీక్షల ముందు ఏదో ఒకట్రెండు రోజులంటే ఏమో గానీ రోజూ తెల్లవారుజామున నాలుగైదు గంటలకే లేపటం, రాత్రి 11 గంటల వరకూ చదివిస్తున్న ఉదంతాలు చూస్తున్నాం. దీంతో పడుకునే ముందు గుండె దడ, పడుకున్నా కలత నిద్రతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కంటి నిండా నిద్రపోకపోతే మెదడు సామర్థ్యం తగ్గుతుంది. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. వ్యక్తిత్వ నైపుణ్యాలూ కొరవడతాయి. చదువుల్లో రాణించటం తగ్గుతుంది. కాబట్టి చిన్న, యుక్తవయసు పిల్లలు తగినంత సేపు నిద్ర పోయేలా చూసుకోవటం తప్పనిసరి. నిద్ర సరిగా పట్టకపోతే రోజంతా రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

how much sleep we need according to age

అలసట, నీరసం, మగత, స్పందనలు ఆలస్యం, మతిమరుపు, ఆలోచనలు మందగించటం, తికమక, ఏకాగ్రత లోపించటం, మూడ్‌ మారటం, ముఖ్యంగా ఆందోళన చెందటం, చిరాకు పడటం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొందరు ఇలా పడుకోగానే అలా నిద్రిస్తారు. అదేంటో కొందరికి ఎంతకీ నిద్ర పట్టదు. చివరికిది సమస్యగా మారుతుంది. రాత్రిపూట త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టినా మధ్యలోనో.. తెల్లవారుజామున్నో మెలకువ వచ్చి, తిరిగి నిద్ర పట్టకపోవటాన్ని నిద్రలేమి (ఇన్‌సోమ్నియా) సమస్యగా పరిగణిస్తారు.

Admin

Recent Posts