పొడి చర్మానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఆయిల్ స్కిన్‌కు మరో క్రీమ్. డ్రై హెయిర్ ఉంటే ఓ షాంపూ… జిడ్డు వెంట్రుకలు ఉంటే ఇంకో ఆయిల్..! ఇలా చర్మం, వెంట్రుకలే కాదు, వ్యక్తిని బట్టి మారే ఆయా అంశాలకు అనుగుణంగా ఎవరైనా రక రకాల క్రీములు, షాంపూలు, ఆయిల్స్ కొనుగోలు చేస్తారు. మరి దంతాలకో… అంటే… ఆ ఏముంది… అందరూ వాడేదే మేమూ వాడతాం… అంటారా..! అయితే అది సరి కాదు. ఎందుకంటే చర్మం, వెంట్రుకలు అందరికీ ఒకేలా ఎలా ఉండవో, అలాగే దంతాలు కూడా ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు. విభిన్న రకాలుగా ఉంటాయి. ఈ క్రమంలో ఎలాంటి దంతాలు ఉన్న వారు, ఏయే నోటి సమస్యలు ఉన్నవారు ఎలాంటి టూత్‌పేస్ట్ వాడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దంత క్షయం (కావిటీ) సమస్య ఉంటే వారు సోడియం ఫ్లోరైడ్ ఉండే టూత్‌పేస్ట్ వాడాలి. దీంతో ఆ కెమికల్ మీ దంతాలను కాపాడుతుంది. దంత సమస్యలను దూరం చేస్తుంది. అయితే టూత్‌పేస్ట్‌లను తినే పిల్లలకు మాత్రం ఇలాంటి పేస్ట్‌ను వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి టూత్ పేస్ట్ లోపలికి వెళ్తే దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
2. వేడి లేదా చల్లని వస్తువులు తిన్నవారికి దంతాల్లో నొప్పి వస్తుంది. దంతాలు తీపులు వచ్చినట్టు అవుతాయి. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు డీసెన్సిటైజింగ్ (Desensitizing) టూత్ పేస్ట్ వాడాలి. దీంతో వేడి, చల్లని పదార్థాలను తిన్నా దంతాలకు ఏమీ కాదు.
3. చిగుళ్లలో నొప్పిగా ఉండి, అప్పుడప్పుడు రక్తం కారుతూ ఇతర చిగుళ్ల సమస్యలతో బాధ పడేవారు Anti-gingivitis కలిగిన టూత్ పేస్ట్ వాడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఇలాంటి టూత్‌పేస్టే చక్కని పరిష్కారం.
4. పాచితో కొందరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు Tartar-control టైప్ టూత్ పేస్ట్‌ను వాడాలి. ఇలాంటి టూత్ పేస్టులు నోట్లో ఉండే బాక్టీరియాను నిర్మూలించి తాజా శ్వాసను కూడా ఇస్తాయి.
5. ఇక చివరిగా దంత సమస్యలు ఏమీ లేని వారు వాడాల్సింది టీత్ వైటెనింగ్ టూత్ పేస్ట్. అంటే దంతాలను తెల్లదిగా మార్చే టూత్ పేస్ట్ అన్నమాట. సాధారణంగా అందరూ ఇదే పేస్ట్‌ను వాడుతారు. అయితే పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు మాత్రం చెప్పిన విధంగా పేస్ట్‌లను వాడితే మంచిది.