mythology

త‌న త‌ల్లి త‌ల‌నే నరికిన ప‌ర‌శురాముడు.. ఆయ‌న అలా ఎందుకు చేశాడంటే..?

ఋచీథకుని కుమారుడైన జమదగ్ని, ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకను వివాహం చేసుకున్నాడు. వీరికి రమణ్వతుడు, సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు జన్మించారు. జమదగ్ని గొప్ప తప‌స్సంపన్నుడు మాత్రమేగాదు, గొప్ప ధనుర్విద్యావేత్త కూడా. జమదగ్ని బాణాలు సంధించి వదులుతూంటే, వాటిని ఏరి తెచ్చి భర్తకు ఇచ్చేది రేణుక. ఇది వారి నిత్యక్రీడ. ఒకసారి జమదగ్ని విడిచిన బాణం తీసుకురావడానికి వెళ్ళిన రేణుక ఆలస్యంగా భర్త దగ్గరకు వచ్చింది. కాలయాపనకు కారణం అడిగాడు జమదగ్ని. సూర్యతాపానికి కాళ్ళు కాలిపోతూంటే భరించలేక ఓ చెట్టు నీడన ఆగాను, అందుకే ఆలస్యం అయింది అని బదులు చెప్పింది రేణుక. జమదగ్నికి సూర్యునిపై కోపం వచ్చి, సూర్యుని సంహరించాలనే సంకల్పంతో బాణప్రయోగం చేయబోయాడు. సూర్యుడు ఓ బ్రాహ్మణరూపంలో వచ్చి సూర్యునిపై బాణ ప్రయోగం చేయడం పాపం, తాపం ఆయన తత్త్వం, ఈ ప్రయత్నం వదులుకో అని చెప్పాడు. జమదగ్ని వినలేదు. అప్పుడు సూర్యుడు నిజరూపంలో ప్రత్యక్షమై, జమదగ్నిని దీవించి, అతని భార్యకు కాళ్ళు కాలకుండా చెప్పులు, తల మాడకుండా గొడుగు బహూకరించాడు. ఈవిధంగా చెప్పులు, గొడుగు ఈ లోకంలో అందరికి అందుబాటులోకి వచ్చాయి.

ఒకసారి రేణుక నీళ్ళు తీసుకురావడానికి నదికి వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరధుడనే గంధర్వుడు తన భార్యాసమూహంతో జలక్రీడలు ఆడుతున్నాడు. వారి క్రీడావినోదాలను చూస్తూండిపోయిన రేణుక, కాలయాపన జరిగిందని తెలుసుకుని, భయప‌డుతూ ఆశ్రమానికి వచ్చింది. ఆలస్యానికి కారణం గ్రహించిన జమదగ్ని, తన కుమారులను పిలిచి మీ తల్లి మానసిక వ్యభిచారం చేసింది, అందుకు శిక్ష శరచ్ఛేదమే, మీ తల్లి తల నరకండి అని ఆఙ్ఞాపించాడు. మాతృవధ చేయడానికి నలుగురు పెద్దకుమారులు అంగీకరించలేదు. జమదగ్ని వారిని దారుణంగా శపించాడు. పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞ‌కు కట్టుబడి తల్లి తల నరికాడు. పరశురాముని పితృభక్తికి సంతసించిన జమదగ్ని, పరశురాముని వరం కోరుకోమన్నాడు. తన తల్లిని బ్రతికించమని తండ్రిని కోరాడు పరశురాముడు. జమదగ్ని రేణుకను బ్రతికించాడు.

why parashurama beheaded his mother

మాతృహత్య పాతకనివృత్తికై పరశురాముడు తన పితామహుడైన భృగువు ఆదేశం మేరకు హిమాలయాలకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. పరమశివుడు ప్రత్మక్షమై అజేయమైన పరశువును(గొడ్డలిని) బహూకరించి, దేవతలకు సాయంగా యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. పరశురాముడు దేవదానవ యుద్ధంలో పాల్గొని దేవతల విజయానికి కారణమయ్యాడు. అందుకు సంతసించిన పరమశివుడు పరశురామునకు సకల దివ్యాస్త్రాలు ప్రసాదించాడు.

Admin

Recent Posts