అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవలే పాకిస్థాన్‌కు 1 బిలియన్ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో IMF ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. పాక్‌కు నిధులను అందజేస్తే వారు ఆ నిధులను తమ దేశం బాగుకోసం కాకుండా ఉగ్రవాదం కోసం ఖర్చు చేస్తున్నారని, కనుక పాక్‌కు నిధులను ఎట్టి పరిస్థితిలోనూ అందజేయకూడదని భారత్ పదే పదే వ్యాఖ్యానించింది. అయినప్పటికీ IMF పట్టించుకోలేదు. 1 బిలియన్ డాలర్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ నిధులను IMF తాజాగా మంజూరు చేసింది.
అయితే పాకిస్థాన్‌కు 1 బిలియన్ డాలర్లను IMF మంజూరు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ కొన్ని షరతులను కూడా పాకిస్థాన్‌కు IMF విధించింది. భారత్‌తో ఇంకా ఉద్రిక్తతలను పెంచుకోకూడదని చురకలు అంటించింది. తాము అందజేసిన నిధులను పాక్ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని, ఇతర అంశాలకు మళ్లించకూడదని హెచ్చరించింది. అయితే భారత దాడిలో ధ్వంసమైన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ స్థావరాలను తిరిగి నిర్మించుకునేందుకు గాను అతనికి రూ.14 కోట్లు అందజేస్తామని పాక్ ప్రకటించిందని భారత్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో IMF నిధులు మంజూరు చేయడం షాకింగ్ గా మారింది. అయితే పాక్ గనుక ఆ నిధులను ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు ఖర్చు చేస్తే అప్పుడు భారత్ మరిన్ని ఆధారాలను బయట పెట్టి ప్రపంచం ఎదుట పాక్‌ను దోషిగా నిల బెట్టే అవకాశం ఉంటుంది.