ఏప్రిల్ నెల వస్తుందంటే చాలు అందరికీ ఒక విషయం గుర్తుకు వస్తుంది. అబ్బే.. ఏప్రిల్ 1 నుంచి పెరగబోయే ధరలు కాదు లెండి. ఇప్పుడా విషయాల గురించి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మరి ఏ విషయం అంటే.. అదేనండీ.. ఏప్రిల్ నెల వస్తుందనగానే మనకు ఏప్రిల్ ఫూల్స్ డే గుర్తుకు వస్తుంది కదా. ఏప్రిల్ 1వ తేదీన మనకు తెలిసిన వారిని ఎలా ఫూల్ చేయాలా అని ఆలోచించి మరీ అందుకు అనుగుణంగా ప్లాన్ వేసి వారిని ఫూల్స్‌ను చేస్తాం. అయితే నిజానికి ఆ తేదీనే ఫూల్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇప్పట్లో కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకుంటున్నాం కానీ ఒకప్పుడు మాత్రం ఏప్రిల్ 1 లేదా మార్చి 25వ తేదీలను రోమన్లు, యురోపియన్లు కొత్త సంవత్సరం ఆరంభ తేదీగా జరుపుకునేవారట. అయితే 1582వ సంవత్సరంలో పోప్ గ్రెగరీ XIII అనే చక్రవర్తి నూతన క్యాలెండర్‌ను తయారు చేయించారట. దాన్నే జియోర్జియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని ఆ రాజు గారు ఆదేశించారట. దీంతో అందరూ అప్పటి నుంచి జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటూ వచ్చారు.
అయితే సదరు రాజు గారు పెట్టిన నిబంధన కొందరికి నచ్చలేదట. దీంతో వారు ఏప్రిల్ 1వ తేదీన్నే నూతన సంవత్సరాన్ని యథావిధిగా జరుపుకునేవారట. ఈ క్రమంలో రాను రాను జనవరి 1వ తేదీన నూతన సంవత్సరాన్ని జరుపుకునే వారు పెరిగిపోయి, ఏప్రిల్ 1వ తేదీన నూతన సంవత్సరం జరుపుకునే వారి సంఖ్య బాగా తగ్గుతూ వచ్చింది. దీంతో అందరూ ఏప్రిల్ 1వ తేదీన నూతన సంవత్సరాన్ని జరుపుకునే వారిని మూర్ఖులలా చూడడం మొదలు పెట్టారు. క్రమంగా వారిని ఫూల్స్ అనడం ప్రారంభించారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీన నూతన సంవత్సరం జరుపుకునేవారిపై ఫూల్స్ అనే ముద్ర పడింది. అది రాను రాను ఫూల్స్ డేగా మారింది. ఇదీ.. ఏప్రిల్ 1 ఫూల్స్ డే కావడానికి వెనుక ఉన్న అసలు రీజన్.