మిణుగురు పురుగుల గురించి తెలుసు కదా. వీటిని చూడని వారుండరు. రాత్రి వేళల్లో మిణుకు మిణుకుమంటూ వెలుతురును వెదజల్లుతాయి. వాటి నుంచి వచ్చే కాంతి విభిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో మిణుగురు పురుగులను పట్టుకునేందుకు, వాటితో ఆటలాడేందుకు చాలా మంది యత్నిస్తారు. అదో రకమైన సరదాగా ఉంటుంది. అయితే నిజానికి మిణుగురు పురుగులకు ఆ వెలుతురు ఎందుకు వస్తుందో తెలుసా..? అవి వెలుతురును ఎందుకు వెదజల్లుతాయో ఇప్పుడు చూద్దాం.
మిణుగురు పురుగులు వెలుతురు వెలువరించడానికి కారణం జీవ ప్రకాశకత్వం (బయోల్యుమినిసెన్స్) అనే రసాయనిక చర్య. మిణుగురుల దేహంలోని జీవకణాలలో ఉండే ఆక్సిజన్ క్యాల్షియంలో కలిసినపుడు ఒక్కసారిగా వెలుతురు వెలువడుతుంది. ఆ వెలుతురు చల్లని కాంతి. అలా కాంతి వెలువడేందుకు వీలుగా వాటి పొట్ట భాగంలో ఓ అవయవం ఉంటుంది. అందులోనే కాంతి వస్తుంది. అదే మనకు బయటకు కనిపిస్తుంది. అయితే ఆ అవయవంలో కాంతి చల్లగా ఉంటుంది. వేడిగా ఉంటే మిణుగురు పురుగు బతకదు.
అసలు మిణుగురు పురుగులే అలా కాంతిని ఎందుకు వెదజల్లుతాయో ఇప్పటికీ సైంటిస్టులు కనిపెట్టకపోయారు. అయితే కొందరు సైంటిస్టులు మాత్రం ఇంకో కారణం చెబుతున్నారు. అదేమిటంటే… మిణుగురు పురుగులు (ఆడైనా, మగైనా) ఇతర మిణుగురులను ఆకర్షించేందుకు అలా వెలుతురును ప్రసారం చేస్తాయట. కొన్ని మిణుగురులు ఇతర మిణుగురులతో వెలుతురును ప్రసారం చేయడం ద్వారా మాట్లాడుకుంటాయట. అవి ఆ విధంగా కమ్యూనికేషన్ కోసం వెలుతురును వెదజల్లుతాయట. కొన్ని సందర్భాల్లో శత్రువును కన్‌ఫ్యూజ్ చేయడం కోసం కూడా మిణుగురులు అలా వెలుతురును వెదజల్లుతాయట. సరే… కారణాలు ఏమున్నా అవి వెదజల్లే కాంతిని చూస్తుంటే అదోలాంటి రిలాక్స్ అయిన అనుభూతి మాత్రం మనకు కలుగుతుంది కదా..!