Off Beat

ప్రయాణాల్లో ప్రాణానికే ప్రమాదం అనిపించిన పరిస్థితులను ఎదుర్కొన్నారా? దానిలోంచి ఎలా బయటపడ్డారు?

నాకు శ్రీశైలంలో జరిగింది. అసలు ప్రయాణం ఎలా మొదలైంది? మా బాబు పుట్టిన ఐదు నెలలకు, హైదరాబాద్ తీసుకు వచ్చారు. మా అత్తగారు ప్రసవం సాఫీగా సాగితే శ్రీశైలంతో పాటు తిరుపతి, షిరిడి వస్తానని మొక్కుకున్నారు. హైదరాబాద్ వచ్చినా ఊరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. నేను కూడా సినిమాలలో వినటమే కానీ, శ్రీశైలం, నల్లమల్ల అడవి చూసింది లేదు. అప్పటికే దేశంలో కోవిడ్ మొదటి కేసు వచ్చి కొన్ని వారాలు అవుతుంది. నేను ఆలోచించగా, ఇప్పుడు శ్రీశైలం వెళ్లకపోతే కోవిడ్ కారణంగా భవిష్యత్తులో చాలా రోజులు పాటు వెళ్లడానికి అవకాశం ఉండదని అర్థమైంది. ఇదే విషయం చర్చించి శివరాత్రి రోజు బాగా రద్దీ ఉంటుంది కాబట్టి తర్వాత రోజు బయలుదేరుదాం అని నిశ్చయించుకున్నాము. నాకు డ్రైవింగ్ పూర్తిగా రాకుండానే నా భార్య, మా మామగారు పట్టుబట్టి కారు కొనేశారు.

సాధారణ డ్రైవింగ్ వచ్చినా, అప్పటికి కారు కొన్న తర్వాత నేను నేర్చుకున్నది – ఘాట్ రోడ్డులాంటి ప్రదేశాల్లో పైకి వెళ్ళడానికి, క్లచ్ ఉన్న బండిని నిలుపుదల చేసి తర్వాత ముందుకు పోనివ్వడం. రెండుసార్లు 500 కిలోమీటర్ల ప్రయాణం హైదరాబాద్ నుంచి ఇంటికి సొంతగానే డ్రైవ్ చేసుకుని రావటం మాత్రమే నాకున్న అనుభవం. కాని అసలు సిసలైన ఘాట్ రోడ్డులో కారు నడపలేదు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం 200 కిలోమీటర్లు. 110 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నల్లమల అడవి వస్తుంది. నల్లమల అడవితో ఘాట్ రోడ్డు కూడా ఆరంభమవుతుంది. మిగతా 90 కిలోమీటర్లూ ఇంచుమించుగా అడవి, ఘాట్ రోడ్డే. నేను ఆది నుంచి జాగ్రత్త పరున్ని కావడంతో, డ్రైవింగ్లో ఎక్కడైనా పొరపాటు సంకేతాలు వస్తే వెంటనే సరిదిద్దుకునే వాడిని. కారుపై నియంత్రణ కోల్పోకుండా వేగం తగ్గించి పొరపాటు జరిగిన అంశంలో తెలిసినంతలో మళ్లీ తప్పు జరగకుండా డ్రైవ్ చేసేవాడిని. అప్పటికే క్లచ్ నియంత్రణపై పట్టు ఉండటం వల్ల గూగుల్ మ్యాప్ సహాయంతో శ్రీశైలం గుడికి ఉదయం 5 గంటలకు ప్రయాణమై 11 గంటలకు ఘాట్ రోడ్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయాము. శివరాత్రి తర్వాత రోజు అయినా కానీ రద్దీ బాగా ఎక్కువగానే ఉంది. మావద్ద చిన్న బాబు ఉండటంవల్ల, అక్కడి సిబ్బంది ఎక్కడికక్కడ మమ్మల్ని లైన్లు తప్పించి నేరుగా దర్శనానికి తీసుకొని వెళ్ళిపోయారు. గుడిలోనే భోజనం చేసి 2 గంటల సమయంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యాం.

have you faced any problem while driving in srisailam ghat roads

సుదీర్ఘమైన ఘాట్ రోడ్లనగానే అక్కడ ఉండేది భయంకరమైన హెయిర్ పిన్ బెండ్లు, లోయలు. అయితే శ్రీశైల క్షేత్రం దాటి ఘాట్ రోడ్ ప్రయాణం మొదలవ్వగానే, నాలోని ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారింది. శ్రీశైలం వస్తున్నప్పుడు ఘాట్ రోడ్ డ్రైవింగ్ మొదటిసారైనా విజయవంతంగా మరో ముగ్గురిని కారులో ఎటువంటి కష్టం లేకుండా తీసుకు రావటంతో ఈ అతి విశ్వాసం నాలో వచ్చింది. దానితోటి ఆలోచనలో హేతుబద్ధత కూడా తప్పింది. పైకి వచ్చేటప్పుడు నెమ్మదిగా రావాలి కాబట్టి కిందకి వెళ్లేటప్పుడు హెయిర్పిన్ మలుపు దగ్గర వేగంగా తిప్పితే సరి అని అనిపించింది. ఇంతలో మొదటి మలుపురానే వచ్చింది. అనుకున్న విధంగానే వేగంగా కారు తిప్పడానికి ప్రయత్నించాను. అక్కడే కుడివైపు పెద్ద లోయ ఉంది. మలుపు తిరుగుతున్నప్పుడు రోడ్డుకు ఎడమ వైపు ఉండాల్సిన కారు రోడ్డు కుడివైపుకు వెళ్లిపోతుంది.

బ్రేకు వేయడం ఏ మాత్రం ఆలస్యం అయినా, కారు లోయలోకి వెళ్లిపోతుందనిపించింది. కారులో ఉన్న కుటుంబ సభ్యులను తలుచుకొని భయం వేసింది. గట్టిగా బ్రేకు అద్దమిపట్టినా ఇంకా కుడివైపుకు డ్రిఫ్ట్ అయిపో సాగింది. నా భయం మరింత పెరిగింది. ఒక్క క్షణం అంతా అయిపోయింది అనుకున్నాను. నమ్మిన దేవుళ్లందరినీ తలచుకున్నాను. అయితే తలుచుకున్న దేవుళ్ళవల్లనేమో కారు రోడ్డు అంచుకు ఒక అడుగు దూరంలో ఆగింది. అప్పుడు రెండు నిమిషాలు కదలకుండా ఉండి, ఇకనుంచి అటువంటి మలుపుల్లో ఎలా నడపాలో ఆలోచించాను. దిగేది పల్లం కాబట్టి మలుపు తిరిగేదప్పుడు వేగం పనికిరాదని అర్థమైంది. బ్రేక్ మీద కాలుంచి వాహన వేగాన్ని నియంత్రిస్తూ మలుపు తిప్పితే ఇటువంటి సమస్యరాదు అని అర్థం అయింది. అదే అమలుపరుస్తూ ఘాట్ రోడ్డు అంతమయ్యేవరకు జాగ్రత్తతో కారు నడిపాను. ఆ సుదీర్ఘ ఘాట్ రోడ్డు అంతమయ్యాకగాని నాలో మొదలైన దడ తగ్గలేదు. ఇప్పటికీ ఆ సన్నివేశం ఎప్పుడు తలుచుకున్నా ఒక్క క్షణం దడ వస్తుంది.

Admin

Recent Posts