Off Beat

క‌డుపు నొప్పి.. చిన్న క‌థ‌.. నేటి స‌మాజం అలాగే ఉంది..!

పెళ్లి బాగా జరిగింది. ఆ తర్వాత రోజు రిసెప్షన్ కూడా అయిపోయింది. మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లాలి. చుట్టాలు సామాన్లు సర్దుకుని బస్టాండ్ బాట పట్టారు. ఆటోలు రోడ్డు మీద వరుసగా సాగుతున్నాయి. వాటి వేగానికి లోపల మాటలు పోటీ పడుతున్నాయి. కొంచెం తొందరగా పోనీ బాబూ.. ప్ర‌యాణికుల అరుపులు.. ఏమైంది?.. అన్నాడు ఆటో డ్రైవ‌ర్‌. ఏంటో! కడుపులో ఒకటే నొప్పి. తొందరగా బస్టాండ్‌లో పడితే ఏదో బస్సెక్కి పడుకోవచ్చు. కాస్త నెమ్మదిస్తుంది.. అన్నారు. ఇవాళ ఉండిపోయుంటే పోయేది!. మ‌రో ప్ర‌యాణికురాలి మాట‌. ఆ.. ఎందుకులే తల్లీ?. అట్లా కాదు! ఉంటే రాత్రికి కూరానారా ఏర్పాట్లేమన్నా ఉండేవేమో?. నా మొహం! వాళ్లు ఈ మూడు రోజులు మనకు తిండి పెట్టిందే గొప్ప..

అయ్యో అట్లా అంటావేంది? వాళ్లకు కలిగింది ఏదో పెట్టారు. అంతకంటే ఏం చేస్తారు?. పిల్చినప్పుడు మర్యాద సరిగ్గా చేయాలి. లేకపోతే పిలవనేకూడదు. ఇంత దూరం ఛార్జీలు పెట్టుకుని వచ్చినందుకు కనీసం ఓ జాకెట్టు ముక్కైనా పెట్టలేదు. ఇదేం పద్ధతి?. జాకెట్టేమి? చీరే పెట్టినట్టు ఉన్నారుగా. ఆ.. ఏం పెట్టడం? రంగు వెలిసిన చీర. పాతరకం జాకెట్టుముక్క. పెట్టామన్న పేరు తప్ప ఏమన్నా పసందుగా ఉందా? అక్కడే మొహం మీద కొట్టి వద్దును. నాకెందుకు లే అని తీసుకున్నా. ఇంటికెళ్లాక పని పిల్లకి ఇచ్చేస్తా!.. నాకూ అంతే! రా పిన్నీ అని ప్రేమగా పిలిపించి పనులన్నీ చేయించుకుని కనీసం ఓ మంచి చీరన్నా పెట్టలేదు. అయినా వాళ్ల చీరలూ, సారెలూ నాకెందుకు? లేని వాళ్లైతే ఆశకు చూస్తారు కానీ మాకెందుకు?.. అంతే.. అంతే! పెళ్లిలో కూడా అన్నీ అటుఇటుగా.. తూతూ మంత్రంగా జరిగిపోయాయి. నాకేమీ నచ్చనేలేదు. మళ్లీ ఎవరితో అంటే ఏమంటారో కానీ, పిల్లాడు ఏం బాగున్నాడు? నల్లగా కాకిలాగా! ఆ పిల్ల ఎట్లా ఒప్పుకుందో..

women travelling in auto stomach pain micro story

పిల్ల మాత్రం ఏం బాగుంది? మేకప్ వేసినందుకు తెల్లగా కనిపించింది కానీ, లేకపోతే నలుపే.. ఆటో గతుకుల మీద పోతోంది. లోపల కూర్చున్నవారి శరీరాలు మాటలతో కలిసి ఎగిరెగిరిపడుతున్నాయి. రాత్రి నిద్ర పట్టనే లేదు. ఇల్లు పేరుకే పెద్దది కానీ, కళ లేనేలేదు. ముప్పై లక్షలు పెట్టి కట్టారంటా.. ఆ.. అన్నీ అప్పులు తెచ్చినవే! పిల్ల పెళ్లి కూడా అప్పు తెచ్చి చేసిందే! పిల్లాడికి గవర్నమెంట్ నౌకరీ ఉందన్న ఆశ.. అంతేలే! ఈ కాలంలో సంబంధాలు దొరకడమే కష్టం. ఆ.. ఇట్లా ఆశలకు పోతే బొక్కబోర్లా పడతారు. ఎందర్ని చూడలేం?. ముందు ముందు తెలుస్తుందిలే! తొందరేముంది? నీ నొప్పి తగ్గిందా?. కొంచెం.. అంత నొప్పి తాళలేకుండా ఎందుకు? రేపు బయలుదేరాల్సింది.. ఎన్ని రోజులుంటాం ఇక్కడే! ఊర్లో పిల్లలకు ఇబ్బంది. అయినా నాకు ఉండాలనున్నా ఇంటివాళ్లు ఉండమనకపోతే ఎలా? ఉండమని అడిగితే ఉండేదాన్ని..

అడగలేదా?.. ఏం అడగడం లే! నా దగ్గరికొచ్చి ఇవాళ ఉండులే‌ పిన్నీ అంది పెళ్లికూతురు తల్లి. మాటలో మాటలాగా ఓ అత్తెసరు మాట నా ముఖాన పారేస్తే చాలా? గట్టిగా చెప్పకపోతే ఉండాలనిపిస్తుందా? నేనుండే ఇష్టం వాళ్లకే లేనప్పుడు నాకెందుకు? అయినా ఆ మనుషుల తీరే అంతలే.. అంతే.. అంతే! మనకు మాత్రం ఇండ్లుండవా? పిల్లలుండరా? ఊర్లు పట్టుకుని తిరిగితే ఏమొస్తుంది? వాళ్లనీ వీళ్లని అంటే ఏం మిగుల్తుంది?.. అవును! ఎవరి సంగతులు మనకెందుకు? మన ఇండ్లు మన చేతిలో సరిగ్గా ఉంటే చాలు.. ఆ.. బస్టాండ్ వచ్చింది దిగు.. మల్లెప్పుడూ కలవడం?.. మళ్లీ ఏదో పెళ్లి రాకపోదా.. ఆ.. అంతే..

ఆటో దిగి లగేజీ పట్టుకుని బస్సు వైపు నడుస్తూంది. కడుపులో ఉన్నదంతా ఖాళీ అయినట్టు అనిపించింది. ఆటో ఎక్కినప్పుడు మొదలైన నొప్పి ఇప్పుడు లేదామెకు. ఎటు పోయిందో?

Admin

Recent Posts