నోటరీ, అఫిడవిట్ లేదా ఏదైనా కేసు విషయమై లాయర్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే, మీరు ఎంపిక చేసుకున్న లాయర్ అసలు లాయర్ అయి ఉండకపోవచ్చు. ఏంటీ… షాక్ అయ్యారా..! అయినప్పటికీ మేం చెబుతోంది నిజమే. ఎందుకంటే మన దేశంలో ఉన్న చాలా మంది లాయర్లలో దాదాపు సగం మంది వరకు నకిలీ లాయర్లేనట. ఇది మేం చెబుతోంది కాదు. సాక్షాత్తూ బీసీఐ చెబుతోందే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చేసిన వెరిఫికేషన్‌లో తేలిన నిజమిది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గతంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పలు ఆదేశాలు జారీ చేసింది. దాని సారాంశమేమిటంటే… దేశంలో చాలా మంది వ్యక్తులు డిగ్రీలు లేకున్నా లాయర్లుగా చలామణీ అవుతున్నారట. ఇంకా కొందరైతే ఎలాంటి విద్యార్హత లేకున్నా ఏకంగా కోర్టుల్లోకి వచ్చి కేసులు వాదిస్తున్నారట. అందుకే అలాంటి వ్యక్తులను ఏరివేసేందుకు గాను వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందులో భాగంగానే బీసీఐ గతంలో లాయర్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది.
అయితే దేశవ్యాప్తంగా వెరిఫికేషన్ చేయాలంటే లాయర్లు చాలా మంది ఉంటారు కాబట్టి, ఆ ప్రక్రియ కొంత ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే బీసీఐ వెరిఫికేషన్‌లో చాలా విషయాలు తెలిశాయి. అప్పటికి వారు చేసిన వెరిఫికేషన్ ప్రక్రియలోనే దేశంలో దాదాపుగా 30 శాతం మంది నకిలీ లాయర్లు ఉన్నట్టు గుర్తించారు. కాగా వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మన దేశంలో ఉన్న నకిలీ లాయర్ల సంఖ్య ఎంత తేలిందో తెలుసా..? 45 శాతం. ఇప్పటికే ఉన్న లాయర్లలో దాదాపుగా 45 శాతం మంది లాయర్లు నకిలీ అని బీసీఐ గుర్తించింది. ఆ మేరకు వివరాలను సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఇక సుప్రీం కోర్టు నకిలీ లాయర్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏది ఏమైనా మీరు లాయర్ దగ్గరకు వెళ్తుంటే మాత్రం ఓ సారి అన్ని వివరాలు చెక్ చేసుకుని మరీ వెళ్లడం మంచిది. లేదంటే నకిలీ లాయర్ చేతిలో బలవ్వాల్సి వస్తుంది..!