మన తిన్న ఆహారాన్ని, తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రమంటారని మనందరికీ తెలుసు. మూత్ర విసర్జన చేయడమంటే వ్యర్థాలను బయటికి పంపడమే. ఈ క్రమంలో రోజూ కొందరు అధికంగా, మరికొందరు తక్కువగా మూత్రానికి వెళ్తారు. అందుకు రక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి. మనిషికి నిత్యం 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. కచ్చితంగా అంత మొత్తంలో నీటిని తాగితేనే దాన్ని శరీరం పూర్తిగా ఉపయోగించుకుని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. కనీస మోతాదుకు తక్కువగా నీరు తాగితే అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి. ప్రధానంగా కిడ్నీలు ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.
అయితే రోజుకి కనీసం 2 లీటర్ల నీటిని తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు 4 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయాలట. 4 సార్ల కన్నా తక్కువగా మాత్రం మూత్ర విసర్జన చేయకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసినా ఎలాంటి హానీ లేదు. ఆల్కహాల్, కాఫీ, టీ వంటివి తాగినప్పుడు, మూత్రాశయం ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, నీటిని అధికంగా తాగేవారు సహజంగానే 7 సార్ల కన్నా ఎక్కువగానే మూత్ర విసర్జన చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 7 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది సహజమే. అయితే కేవలం 2 లీటర్ల నీటిని మాత్రమే తాగుతున్నా రోజుకు 11 సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు ఆ పరిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
మూత్రం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. దీని వల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు-తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు మూత్రం రంగు ఎలా ఉన్నా, ఎలాంటి వాసన వచ్చినా భయం లేదు. అదే జంక్ ఫుడ్ వంటివి తిన్నప్పుడు మూత్రం రంగు మారడం, దుర్వాసన రావడం వస్తే అనుమానించాలి. మూత్రం తీయని వాసన వస్తుంటే వారికి డయాబెటిస్ ఉందని తెలుసుకోవాలి.
మూత్రంలో దాదాపు 95 శాతం వరకు నీరే ఉంటుంది. మిగిలినది వ్యర్థ పదార్థమే. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్ర విసర్జన వ్యవధి 7 సెకండ్ల వరకు ఉంటుంది. అయితే ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. వయస్సు మీద పడిన కొద్దీ మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తుంటుంది.