వినోదం

మన హీరోల పేర్ల‌కు ముందు స్టార్ అని రాయ‌డం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని కంచి పీఠాధిపతి ఎన్టీయార్ కు ఇచ్చారు. సీతారామ కల్యాణం సినిమా చూశాక (అంటే 1961 లో) ఇచ్చిన బిరుదు అది. ఇదే కాక నట రత్న అనే టైటిల్ కూడా ఆయనకు ఉంది. ఇది శ్రీశైల్ జగద్గురు అనే ఆయన ఇచ్చారు. నట సామ్రాట్ అనే టైటిల్ ఏయన్నార్ కు ఆయన అభిమానులు ఇచ్చారు. హిందీలో దిలీప్ కుమార్ కు ఉన్నట్టుగానే ఏఎన్నార్ కి కూడా ట్రాజెడి కింగ్ అనే టైటిల్ కొంత కాలం నడిచింది. కాంతారావు పేరుకి ముందు కత్తుల అనేది చేర్చింది అభిమానులే. 400 సినిమాలకు పనిచేసినప్పటికీ ఏ సినిమాలోనూ ఆయన పేరు ముందు టైటిల్ పడలేదు. జ్యోతి చిత్ర అనే పత్రిక 1982 లో సూపర్ స్టార్ టైటిల్ కి ఎవరు అర్హులు అనే శీర్షిక నిర్వహించింది. అందులో అభిమానులు సూపర్ స్టార్ గా కృష్ణను ఎన్నుకున్నారు. 1982 నుండి 1986 వరకు ప్రతీ సంవత్సరం సూపర్ స్టార్ గా కృష్ణనే మొదటి స్థానంలో నిలబడ్డారు. ప్రతీసారి ఆయన్నే ఎన్నుకుంటూ ఉండటం వల్ల సూపర్ స్టార్ అనే టైటిల్, కృష్ణకే శాశ్వతంగా ఇచ్చేశారు.

ఇదే కాకుండా నట శేఖర అనే టైటిల్ కూడా కృష్ణకి ఉంది. ఇది అనంతపూర్, గుడివాడ మునిసిపల్ సివిక్ సెంటర్ కు చెందిన ఒక ఎన్జీవో ఇచ్చింది. అది మాత్రమే గాక అభిమానులు డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అనే టైటిల్ నూ ఇచ్చారు. నటభూషణుడు అని శోభన్ బాబుకి గౌరవార్థం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదు. ఆంధ్రా అందగాడు, సోగ్గాడు అనేవి ఎలానూ ఉండనే ఉన్నాయి. ఇవి అభిమానులు ఇచ్చినవి. కటకటాల రుద్రయ్య (1978) సినిమా హిట్ తర్వాత నుండి కృష్ణంరాజుని అభిమానులు రెబెల్ స్టార్ అని పిలుచుకున్నప్పటికీ, 1989 లో సింహ స్వప్నం (జగపతి బాబు హీరోగా పరిచయం అయిన చిత్రం)లో మొదటి సారిగా రెబెల్ స్టార్ అనే టైటిల్ కార్డ్ వేశారు. అయితే సినిమాల్లో నిలదొక్కుకున్నప్పటికీ, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నప్పటికి వీరెవరికీ ప్రాపగాండా చేసుకోవాల్సిన అవసరం రాలేదు. అభిమానులు టైటిల్స్ ఇచ్చినప్పటికీ అవేమీ స్క్రీన్ మీద ఉండాలని పట్టుపట్టలేదు.

how the star culture name before actors names was started

సినిమా కోసం విస్తృతంగా ప్రచారం అవసరం పడలేదు. న్యూస్ పేపర్, పోస్టర్ తో పనయిపోయేది. సినిమా బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. లేదంటే లేదు. అంతవరకే. పాతికో సినిమా అయిన నిప్పులాంటి మనిషి సినిమాలో మొదటి సారిగా బాలకృష్ణకు పేరుకు ముందు టైటిల్ వేయడం మొదలెట్టారు. రైజింగ్ స్టార్ యువ కిశోరం అని. ఈ చిత్ర దర్శకుడు మిద్దె రామారావు. ఇది ఒక క్రొత్త పరంపర. సినిమా అందరికీ నచ్చకపోయినా, కనీసం ఆయా హీరోల అభిమానులను తృప్తి పరిచినా చాలు అనే ఆలోచన అంతర్లీనంగా ఉన్నట్టు తోస్తోంది. కథ కన్నా హీరో పెద్దవడం ఇలానే మొదలయింది. కోడి రామకృష్ణ ముద్దుల కృష్ణయ్య సినిమాలో ఈ టైటిల్ ని మార్చి యువ రత్న అని తగిలించారు. తండ్రి ఎన్టీయార్ నట రత్న కాబట్టి కొడుకు యువ రత్న. నిజంగానే అభిమానులను అలరించిన టైటిల్ ఇది. అప్పటి నుండి సింహ సినిమా వరకు ఈ టైటిల్ నే ఉండేది. సింహ సినిమా తర్వాత నట సింహం అని వేయడం మొదలెట్టారు.

గూండా సినిమాలో కోదండరామిరెడ్డి చిరంజీవి పేరుకు ముందు యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ హీరో అనే టైటిల్ పెట్టారు. తర్వాత దానిని కుదించి డైనమిక్ హీరో అని ఎస్ఏ చంద్రశేఖర్ దేవాంతకుడులో మార్చారు. ఆ రెండు టైటిల్స్ జనంలోకి వెళ్లలేదు, దాంతో ఆయా టైటిల్స్ ఆ ఒక్క సినిమాకే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో చిరంజీవి పేరుకు ముందు ఎటువంటి టైటిల్స్ లేవు. మళ్ళీ పులి సినిమాలో కోదండరామిరెడ్డి వాడిన టైటిల్ ని కొంచెం మార్చి డేర్ డాషింగ్ అండ్ డైనమిక్ అని వాడారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన సినిమాలకు వాడలేదు. వేట సినిమాతో కోదండరామిరెడ్డి మరో టైటిల్ సుప్రీం హీరోని చిరంజీవికి వాడారు. అది ఓ 15 సినిమాలకు కొనసాగింది. మరణ మృదంగం నుండి చిరంజీవికి మెగా స్టార్ అనే టైటిల్ పెట్టడం మొదలయింది. ఈ టైటిల్ కూడా కోదండరామిరెడ్డి ఇచ్చినదే. హీరో కి ఎలివేషన్ ఇస్తే సినిమా నిలబడే అవకాశం ఉందని బలంగా నమ్మిన డైరెక్టర్ ఆయన.

అయితే మొదట్లో అభిమానులే ఆ టైటిల్ కి వ్యతిరేకంగా ఉన్నారు, కారణం సుప్రీం హీరో అప్పటికే బాగా పాపులర్ అయి ఉండటం వలన. అందువల్ల ఆ తరువాత వచ్చిన మూడు సినిమాల్లో ఏ టైటిల్ వాడలేదు. స్టేట్ రౌడీ సినిమా నుండి సుప్రీం అని, సుప్రీం హీరో అని వేయడం మొదలెట్టారు. లంకేశ్వరుడు సినిమాకి దాసరి నట విజేత అని వేయించారు. కోదండ రామిరెడ్డి మాత్రం ఎందుకో మెగా స్టార్ అనే టైటిల్ నే హైలైట్ చేయాలని భావించారు. కొండవీటి దొంగతో మళ్ళీ మెగా స్టార్ అని వేయడం మొదలెట్టారు. అది ఆ తర్వాత మారలేదు. కెనడా తెలుగు అలయన్స్ వారు హాస్య కిరీటి అనే టైటిల్ ని రాజేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు. తర్వాత అదే నట కిరీటిగా మారింది. రాజశేఖర్ నటించిన పాత్రల కారణంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే టైటిల్ చాలాకాలం నడిచింది. సత్యమేవ జయతే సినిమాతో మహా స్టార్ అనే టైటిల్ పేరుకు ముందు చేరింది. ఇది రాజశేఖర్ నే స్వయంగా పెట్టుకున్న టైటిల్.

ఏఎన్నార్ కి ఉన్న నట సామ్రాట్ కారణంగా నాగార్జునకు యువ సామ్రాట్ అని పెట్టారు. కింగ్ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున నే స్వయంగా అడిగి మరీ తన పేరు ముందు కింగ్ పెట్టించుకున్నాడు. అందరినీ అలరించడం కష్టం, అందరికీ నచ్చేలా సినిమా చేయడం కష్టం, గెలిస్తే ఇండస్ట్రీలో ఉంటారు. ఓడితే కనుమరుగు అవుతారు. టార్గెట్ పెద్దది, కాబట్టి గెలుపు కష్టంతో కూడుకున్నది. అదే – అభిమానులను పెంచి పోషిస్తూ, వారిని అలరిస్తూ ఉంటే కాసింత మార్కెట్ అయినా మిగులుతుంది. 90వ దశకం మధ్యలో మొదలయిన కమర్షియల్ సూత్రం ఇది. పీపుల్ స్టార్ నారాయణ మూర్తి, రియల్ స్టార్ శ్రీహరి, ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏ1 స్టార్ ఎన్టీయార్, యంగ్ టైగర్ ఎన్టీయార్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా బోలెడుమందికి బోలెడు టైటిల్స్. ఒమెగా స్టార్ అని 90వ దశకంలో ఎవరికో ఇచ్చారు. ఈమధ్య కాలంలో ఆ టైటిల్ ని వరుణ్ తేజ్ కి అర్జీవి తన ట్వీట్ లో వాడారు.

సినిమా అనేది ఒక ప్రొడక్ట్, ప్రొడక్ట్ ప్రమోషన్స్ కోసం రకరకాల విన్యాసాలు చేయక తప్పదు. కోట్ల రూపాయల వ్యాపారం మరి. ప్రాపగాండా చేసుకోని వాళ్ళు, పీఆర్ టీమ్స్ ని మెయింటైన్ చేయని వాళ్ళు, అభిమాన సంఘాలకు చెక్కులు ఇవ్వని వాళ్ళు, పేరుకు ముందు టాగ్ తగిలించుకోని వాళ్ళు క్రమంగా తెరమరుగు అయ్యే కాలం ఇది. తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి, తమ విజయాలను మాటిమాటికి గుర్తు చేస్తూ ఉండాలి. ఒకప్పుడు – క్రింద పడ్డా నైతికత కోల్పోక, నీతి నిజాయితీలను వదలకపోవడం గెలుపు. ఇప్పుడు – అసలు క్రింద పడకుండా, పడినా పడలేదని నమ్మిస్తూ నిలబడటం గెలుపు. క్లుప్తంగా – ఎవరి తప్పూ లేదు. ఎందుకంటే.. ఇది ఫక్తు వ్యాపారం.

Admin

Recent Posts