హెల్త్ టిప్స్

రాత్రిపూట అస‌లు నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు పగలంతా కష్టపడినా రాత్రుళ్లు చాటింగ్‌, వెబ్‌ సిరీస్‌లంటూ గడిపేస్తారు. దీంతో నిద్ర సరి పోదు. ఫలితమే అనారోగ్యాలు, ఒత్తిడి, పనిపై సరిగా దృష్టిపెట్టలేక పోవడం వగైరా. నిద్ర మనకు విశ్రాంతి సమయమే కాదు.. శరీరం తిరిగి పుంజుకోవడానికీ, లోపలి మలినాలను శుభ్రం చేసుకోవడానికీ సాయపడే ప్రక్రియ. కాబట్టి, దీనికీ వేళల్ని తప్పక పాటించాల్సిందే. పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లను పక్కన పెట్టేయండి. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే మెలటోనిన్‌ హార్మోను విడుదలవుతుంది. టీవీ, మొబైళ్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి దీని విడుదలను అడ్డుకుని నిద్రను దరి చేరనివ్వదు. కాబట్టి, పడుకునే సమయంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులకు దూరంగా ఉండాలనే నియమాన్ని పెట్టుకోండి.

పడుకోగానే నిద్ర పట్టదు చాలా మంది చెప్పే కారణమిది. బుర్రంతా ఆలోచనలతో నిండిపోతే నిద్ర త్వరగా రాదు. పడుకొని దీర్ఘశ్వాస తీసుకుంటూ దానిపైనే దృష్టి నిలపండి. ఆక్సిజన్‌ సరఫరా బాగా జరిగి ఒత్తిడి దూరమవుతుంది. మనసు ప్రశాంతంగా మారి కునుకు దరి చేరుతుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు జాజికాయ పొడి కలిపిగానీ, చామంతి టీని కానీ పడుకోబోయే ముందు తీసుకోండి. ఇవి నరాలను శాంత పరిచి, నిద్రపట్టేలా చేస్తాయి.

follow these tips at night for good night sleep

తినడానికీ పడుకోవడానికీ మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి. లేదంటే కడుపులో యాసిడ్‌లు తయారై నిద్ర పట్టకుండా చేస్తాయి. కాబట్టి, త్వరగా భోజనం చేసి, అరగంటపాటు నడిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోండి. కొన్నిరోజులకు అదో అలవాటులా మారుతుంది. వేడుకలు, స్నేహితులతో పార్టీలు ఉండి, నిద్ర ఆలస్యమైనా ఆ ప్రభావం శరీరంపై పడదు. శరీర ఆరోగ్యానికి నిద్ర ప్రధానం. కాబట్టి దానిపై దృష్టిపెట్టండి. అప్పుడు హార్మోనుల్లో అసమతుల్యత, ఇన్‌ఫ్లమేషన్‌, ఒత్తిడి వంటి సమస్యలుండవు. త్వరగా వృద్ధాప్య ఛాయలూ దరిచేరవు.

Admin

Recent Posts