హెల్త్ టిప్స్

ప్రీ డ‌యాబెటిస్ ఉంటే ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగ‌ర్ రాకుండా ఆప‌వ‌చ్చు..!

మధుమేహం.. ఈ వ్యాధి గురించి తెలియని వారుండరు. దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిస్ వచ్చే కొన్నేళ్ల ముందే రోగి ప్రీ డయాబెటిక్ పరిస్థితిని ఎదుర్కుంటాడు. ప్రీ డయాబెటిక్‌తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రీ-డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు. ఇది డయాబెటిస్‌‌కి ముందు వచ్చే దశ. ప్రీ డయాబెటిస్‌ని గుర్తించి ఆరోగ్యపర జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్‌ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, దానికి చికిత్స ఎలా వంటి విషయాలు తెలుసుకుందాం. ప్రీ-డయాబెటిస్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది వస్తే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ షుగర్ వ్యాధి వచ్చిందని నిర్ధారించేంత లక్షణాలు కనిపించవు.

ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి టైప్ 2 డయాబెటిస్, హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రీ-డయాబెటిస్ కండీషన్‌ ఎలాంటి లక్షణాలను, సంకేతాలను చూపించదు. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. అధిక బరువు ఉండటం, తగినంత వ్యాయామం లేకపోవడం, రక్త సంబంధికులకు టైప్ 2 డయాబెటిస్‌ ఉండటం, గర్భధారణ సమయంలో మధుమేహం ఉండటం, యాంటిసైకోటిక్స్, HIV మందులు, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కలిగి ఉండటం, శరీరంలో కొవ్వు, బీపీ ఎక్కువగా ఉండటం, సమయానికి నిద్ర లేకపోవడం, ధూమపానం వంటి కార‌ణాల వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌స్తుంది. ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి 5-10 సంవత్సరాలలో మధుమేహం వచ్చే అవకాశం 50 శాతం వరకు ఉంటుంది. ప్రీ-డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ డయాబెటిస్ రాకపోవచ్చు. ఇది ఉన్నవారిలో దాదాపు 25 శాతం మందికి 3-5 సంవత్సరాల మధ్యలో స్వల్పంగా మధుమేహ లక్షణాలు కనిపిస్తున్నాయి.

if you have pre diabetes follow these tips to prevent it going further

ప్రీ డయాబెటిస్ ఉన్న విషయం తెలియకపోవడంతోనే ఎక్కువ మంది షుగర్ వ్యాధి పడుతున్నారు. వ్యాధి ఉందని తెలిసిన సరైన డైట్ అనుసరించకపోవడం కూడా డయాబెటిస్‌కి కారణమని చెప్పుకోవచ్చు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ప్రీ-డయాబెటిస్‌ కండీషన్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్లను మీ డైట్లో చేర్చుకోండి. రిఫైన్డ్ చక్కెరలు, కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవద్దు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ప్రీ-డయాబెటిక్ పరిస్థితులను నిర్వహించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి రోజుకి 30 నిమిషాలపాటు చేస్తూ ఉంటే ప్రీ డయాబెటిస్ స్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం.

ప్రీ-డయాబెటిస్‌ను నిర్వహించడానికి, టైప్ 2 డయాబెటిస్‌ పెరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన బరువు ఉండటం చాలా ముఖ్యం. అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నట్లైతే క్రమంగా బరువు తగ్గడానికి ప్రయత్నించండి. బరువు తగ్గడం కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ గణనీయంగా పెరగడంలో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా ముఖ్యం. చక్కెర స్థాయిలను బట్టి మన జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. రెగ్యులర్ చెకప్‌లు చేసుకుంటూ డాక్టర్‌ని సంప్రదించాలి. ఒత్తిడికి గురికాకుండా, కంటి నిండా నిద్ర పోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి ఉపయోగపడతాయి. ప్రతి రోజూ 7 – 9 గంటల నిద్ర తప్పనిసరి.

Admin

Recent Posts