ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వేసవి ముగియడంతోనే వర్షాకాలం వెంటనే వచ్చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పడుతున్నాయి కూడా. అయితే ఒక్కో సీజన్‌లో ఆ సీజన్‌కు చెందిన ఆహార పదార్థాలను కొందరు తింటారు. మరి వర్షాకాలంలో ఎవరైనా ఏ పదార్థాలను ఎక్కువగా తింటారు..? అవును, మీరు ఊహించిందే.. వేడి వేడి పకోడి, బజ్జీలు, పునుగులు గట్రా తినాలని చూస్తారు. అయితే ఆగండి.. ఎందుకంటే… నిజానికి వర్షాకాలంలో ఈ ఫుడ్స్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదట. అవును, మీరు విన్నది నిజమే. అయితే మరి ఏయే ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా. బాగా వేయించిన ఆహార పదార్థాలను ఈ కాలంలో అస్సలు తినరాదు. ఎందుకంటే సహజంగానే వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పని తీరు మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అటువంటప్పుడు ఇలాంటి ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి సమస్య వస్తుంది. దాంతో అది గ్యాస్, అసిడిటీకి దారి తీస్తుంది. కనుక ఈ కాలంలో ఫ్రై ఫుడ్స్‌ను తినకపోవడమే మంచిది. అంతేకాదు, నూనెలో బాగా వేయించిన ఆహారాన్ని కూడా తినరాదు. ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
అదేంటి.. ఆకుపచ్చని కూరగాయలను తినవద్దంటారు. అవి మన ఆరోగ్యానికి మంచివే కదా..? అని అడగబోతున్నారు కదా..! అయితే మీరు అంటోంది నిజమే. కానీ ఈ కాలంలో మాత్రం ఆకుపచ్చని కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలను తినరాదు. ఎందుకంటే వాటిలో క్రిములు, బాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఈ కాలంలోనే ఉంటుంది. బాగా శుభ్రం చేసుకుంటాం అనుకుంటే తప్ప వాటిని తినరాదు. సాధారణంగా వర్షాకాలంలోనే చేపలు, రొయ్యలు గుడ్లను పెట్టి పిల్లల్ని కంటాయి. ఈ సమయంలో వాటిపై లార్వా, వైరస్‌లు, ఇతర క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఇక మార్కెట్‌లో అమ్మే చేపలు, రొయ్యలపై ఈ కాలంలో ఉండే తేమ కారణంగా బాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఓ పట్టాన పోవు. కనుక ఈ కాలంలో చేపలు, రొయ్యలను తినకుండా ఉంటేనే బెటర్. లేదంటే ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు.
రహదారులు, హోటల్స్, రెస్టారెంట్స్‌లో అమ్మే పండ్ల రసాలను తాగకూడదు. ఎందుకంటే ఈ కాలంలో అవి తేమ కారణంగా బాక్టీరియా ప్రభావానికి లోనవుతాయి. ఇక కలుషితమైన నీరు కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు. ఇంట్లోనే వాటిని ప్రిపేర్ చేసుకుని తాగవచ్చు. బాటిల్స్, సీసాల్లో అమ్మే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్‌లను అస్సలు తాగరాదు. వాటి వల్ల ఈ కాలంలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. కనుక వర్షాకాలంలో కూల్‌డ్రింక్స్‌ను తాగకపోవడమే మంచిది.