ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసి అందుకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే నిజానికి అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి..? దీన్ని ఎవరైనా నమోదు చేయవచ్చా..? అసలు ఎఫ్ఐఆర్ లో ఏముంటాయి..? వంటి వివరాలు మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులకు ఏదైనా కాగ్నిజబుల్ (విచారించదగ్గ) నేరం గురించి తెలిస్తే దాని గురించి మొదటగా నమోదు చేసే సమాచారాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నమాట. దీన్ని తెలుగులో ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. అంటే ఏదైనా నేరం గురించి పోలీసులకు తెలిస్తే దాని గురించి వారికి మొదటగా తెలిసిన సమాచారాన్ని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేస్తారు. నేరం వల్ల బాధింపబడిన వారు, నేరాన్ని చూసిన వారు లేదా దాని గురించి తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు.
అయితే వీరే కాదు, ఎవరైనా పోలీసు అధికారి కూడా తనకు ఏదైనా నేరం గురించి తెలిస్తే, అది విచారించదగ్గ నేరం అయితే దానిపై తనంతట తానుగా, స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ప్రతి పోలీసు తన వద్దకు వచ్చే కంప్లయింట్‌కు లేదా తాను ఫైల్ చేసే కంప్లయింట్‌కు కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీన్ని బట్టే పోలీసులు కేసు విచారణ, దర్యాప్తులో ముందుకు సాగుతారు. ఆ నేరానికి పాల్పడిన దోషులను కోర్టులో హాజరు పరిచేందుకు, వారికి శిక్ష పడేలా చేసేందుకు ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుంది. కంప్లయింట్ ఇచ్చిన వారి పేరు, అడ్రస్, తేదీ, సమయం, నేరం జరిగిన ప్రదేశం, నేరం ఎలా జరిగిందన్న సమాచారం, దానికి సంబంధమున్న వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలు, సదరు నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందో ఆ సెక్షన్ల వివరాలు, పోలీస్ స్టేషన్ రిఫరెన్స్ నంబర్, దాని సమాచారం తదితర వివరాలన్నీ ఎఫ్ఐఆర్‌లో ఉంటాయి.
నేరం పట్ల ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను ఎవరైనా పోలీసు అధికారి నమోదు చేయకపోతే అప్పుడు బాధితులు సదరు పోలీసు అధికారులకు పైన ఉండే ఉన్నతాధికారులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. దీంతో ఆ ఉన్నతాధికారి స్వయంగా రంగంలోకి యాక్షన్ తీసుకుంటాడు. లేదంటే నేషనల్ లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది. వారెంటు, కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా పోలీసులు తమంతట తాముగా నేరుగా వెళ్లి ఏదైనా నేరం పట్ల ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు, ప్రశ్నించవచ్చు. దీన్ని విచారించదగ్గ నేరం అంటారు. అలా కాని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అప్పుడు కోర్టు పర్మిషన్, వారెంట్ వంటివి ఉండాలి. అవి ఉంటేనే పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా విచారించవచ్చు. అరెస్టు చేయవచ్చు.
ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 యాక్ట్, సెక్షన్ 154లో క్లియర్‌గా వివరించారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు రాసివ్వలేని పక్షంలో పోలీసులు స్వయంగా వారు చెప్పింది విని కంప్లెయింట్ రాసుకోవాలి. అంతేకాదు, బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని కచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వకున్నా బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు బాధితులు ఎలాంటి రుసుం కట్టాల్సిన పనిలేదు. దాన్ని ఉచితంగానే పొందవచ్చు. అయితే ఎవరూ కూడా తప్పుడు సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. అలా చేస్తే చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో సెక్షన్ 203 ప్రకారం పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు దోషులు అవుతారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు అసలైన సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఫిర్యాదు క్లియర్‌గా ఉండాలి. తప్పుల తడకగా ఉండకూడదు.