పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, అధికారాన్ని వాడుతారు. ఈ నేపథ్యంలో వారు సామాన్య జనాలను ఇక ఏమాత్రం పట్టించుకోరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో దాదాపు నాయకులంతా ఇలాగే ఉన్నారు. కాకపోతే కొందరు బయట పడుతున్నారు. మరికొందరు బయట పడడం లేదు. అంతే తేడా. కానీ గతంలో మన దేశానికి ప్రధానిగా పనిచేసిన ఆ గొప్ప వ్యక్తి మాత్రం అలా కాదు. తన పదవిని, అధికారాన్ని సొంత పనుల కోసం, సొంత వారి కోసం ఏ మాత్రం ఉపయోగించుకోలేదు సరికదా ఆ పదవిలో ఉన్నందుకు తనకు ఇతరులు ఇచ్చే గౌరవాన్నే సాధారణ ప్రజలకు కూడా ఇవ్వాలని ఆదేశించి, ఇప్పటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం.
1965లో భారత ప్రధానిగా పని చేస్తున్న సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి ఫియట్ కారు కొనేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5వేల లోన్ తీసుకున్నారు. బ్యాంక్ కూడా త్వరగానే లోన్ శాంక్షన్ చేసింది. కాగా ఆయన ఆ లోన్ మొత్తాన్ని చెల్లించకుండానే 1966లో కన్ను మూశారు. దీంతో బ్యాంక్ వారు ఆయన సతీమణి లలిత శాస్త్రికి లోన్ చెల్లించాలని లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె ఆ మొత్తాన్ని బ్యాంకుకు వాయిదాల పద్ధతిలో చెల్లించారు. కాగా ఆ ఫియట్ కారు శాస్త్రి కుటుంబీకుల ఇంట్లో ఇప్పటికీ ఉందట.
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ కోసం శాస్త్రి కుమారుడు దరఖాస్తు చేసుకోగా ఆ అప్లికేషన్ ఫాంలో శాస్త్రి తన వృత్తిని గవర్నమెంట్ సర్వెంట్ అని రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా ఒక రోజు శాస్త్రి కుమారుడు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో నిరుద్యోగిగా దరఖాస్తు చేసుకునేందుకు లైన్‌లో వేచి ఉండగా అక్కడి క్లర్క్ ఒకతను శాస్త్రి కుమారుడ్ని మీ తండ్రి ఏం చేస్తాడని ప్రశ్నించాడు. అందుకు శాస్త్రి కుమారుడు తన తండ్రి ప్రధాన మంత్రి అని చెప్పగా అక్కడున్న వారందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఇవే కాదు, ఒకానొక సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న శాస్త్రి కుమారుడికి అర్హత లేకపోయినా ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే ఆ ప్రమోషన్‌ను నిలిపి వేయించాడట.
పైన చెప్పిన సంఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. వాటి గురించి తెలుసుకుంటే చాలు లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత నిజాయితీగా, హుందాగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుంది. కేవలం ఈ విషయాల్లోనే కాదు శత్రు దేశమైన పాకిస్థాన్‌పై భారత సైనికులు విజయం సాధించడం వెనుక కూడా శాస్త్రి ధైర్యం, తెగువ, ప్రోత్సాహం ఎంతో ఉందట. శత్రు దేశ సైనికులు దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి లొంగ వద్దని, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, చివరి వరకు దేశం కోసం పోరాడాలని శాస్త్రి సైనికులను ఎప్పటికప్పుడు ప్రేరేపించేవారట. నిజంగా ఆయన లాంటి నాయకులు ఇప్పుడు చూద్దామన్నా లేరు కదా! ఏది ఏమైనా, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులంటే ప్రజలకు సేవ చేసే వారేనని, వారు స్వార్థం కోసం పనిచేయకూడదని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన మన దేశంలో పుట్టి ఇక్కడి ప్రజలకు సేవ చేసినందుకు నిజంగా మనం గర్వ పడాల్సిందే! ఏమంటారు!