కాళ్లూ, చేతులు, ఇతర అవయవాలు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మన పని మనమే చేసుకోవాలి. ఇతరులపై ఏ మాత్రం ఆధార పడకూడదు. స్కూళ్లలో మనం నేర్చుకున్న పాఠం ఇది. గాంధీ మహాత్ముడు కూడా దీన్నే చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ది బెస్ట్ హెల్ప్ అని అన్నారు. ఎవరి పని వారు చేసుకోవడంలో తప్పు లేదు, అది సమాజం పట్ల మన బాధ్యతను ఇంకా పెంచుతుందని ఆయన అన్నారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని జపాన్ లోని పాఠశాలల విద్యార్థులు పాటిస్తున్నారు. ఇంతకీ వారు ఏం చేస్తున్నారో తెలుసా..?
ఇక్కడంటే స్కూళ్లలో తరగతి గదులను ఊడ్చడానికి, బాత్‌రూంలను కడగడానికి, బెల్ కొట్టడానికి, ఒక వేళ హాస్టల్ అయితే భోజనం వడ్డించడానికి స్పెషల్ పనివారు ఉంటారు. కానీ జపాన్ లోని పాఠశాలల్లో అలా కాదు. ఎవరి పని వారే చేసుకోవాలి. ఎవరి తరగతులను వారే శుభ్రం చేయాలి. బాత్‌రూంలను కడగాలి. భోజనం సమయంలో అందరూ తెచ్చుకున్న దాన్ని షేర్ చేసుకుని తినాలి. అంతేకాదు, అలా తిన్నాక రూంను కూడా విద్యార్థులే శుభ్రం చేసుకోవాలి. పాఠశాల ఆవరణను క్లీన్ చేయడంతోపాటు అందులో ఉండే మొక్కల సంరక్షణను కూడా విద్యార్థులే చూసుకోవాలి.
ఇదంతా జపాన్ దేశంలోని స్కూళ్లలో జరుగుతుంది. ఇలా ఎందుకు చేయిస్తారంటే… ఎవరి పని వారే చేసుకోవాలని, అందరూ కలసి పనిచేయడం వల్ల సమాజంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, ఎంత పెద్ద పనైనా పూర్తి చేయవచ్చని చెప్పేందుకే ఇలా చేస్తారు. దీని వల్ల ఆ విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత ఏర్పడుతుందని అక్కడి ప్రభుత్వం నమ్మకం. అందుకనే వారితో అలా పనులు చేయిస్తారు. అయితే అలా కలిసి చేసే పనులకు కూడా వారికి రోజూ కోటా ఉంటుంది. అంటే… అందరూ రోజూ పనిచేయరు. విడతల వారీగా రోజుకు కొందరు చొప్పున పనులు చేస్తారు. ఏది ఏమైనా జపాన్ స్కూళ్లలో పాఠాలతోపాటు విద్యార్థులకు ఇలా అన్ని అంశాలు నేర్పిస్తుండడం మంచి పనే కదా..!