ఉత్తర కొరియాకే కాదు పాకిస్తాన్‌కీ, ఇరాన్‌కీ, లిబియాకీ కూడా అణు బాంబులు తయారుచేయగల సామర్థ్యాన్ని ఇచ్చింది ఒక పాకిస్తానీ శాస్త్రవేత్త – అబ్దుల్ ఖదీర్ ఖాన్, అందరూ ఏక్యూ ఖాన్ అంటారు. ఆ లిస్టు చూడగానే జియో పాలిటిక్స్ కాస్త తెలిసిన వారెవ్వరికైనా గాభరా పుడుతుంది. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా, పాకిస్తాన్ అన్నీ ఒకదాన్ని మించి ఇంకొకటి ఉగ్రవాదం, ఛాందసవాదం, నియంతృత్వం, మిలటరిజం వంటివాటిలో పోటీపడే దేశాలు. వీటిలో ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా అమెరికాను సైతం తమ అణ్వాయుధ శక్తితో ఛాలెంజ్ చేస్తే, పాకిస్తాన్ ఎలా పక్కలో బల్లెంలా ఉందో మనకు తెలియంది కాదు. వీటన్నిటికీ ఈ కార్యకలాపాలు చేయడానికి సామర్థ్యాన్ని ప్రసాదించింది ఈ ఏక్యూ ఖాన్‌యే. అందుకే ఇతన్ని అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు నాయకత్వం వహించిన ఒకాయన బిన్‌లాడెన్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి లేదా కనీసం లాడెన్‌తో సమానమైన ప్రమాదకారి అని పోల్చాడు. ఒక విధంగా చూస్తే బిన్‌లాడెన్ ఎంతగా మనం చూస్తున్న ప్రపంచాన్ని ఇలా మార్చాడో, అంతకన్నా ఎక్కువగానే ఏక్యూ ఖాన్ ప్రస్తుత ప్రపంచ శక్తుల గతిని నిర్దేశించి పారేశాడు.
ఏక్యూ ఖాన్ స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో ఈనాటి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రాంతంలో జన్మించాడు. పాకిస్తాన్ ఏర్పడ్డాకా అక్కడికి వెళ్ళిపోయాడు. కరాచీలో ఫిజిక్స్ చదువుకున్నాడు, పాకిస్తాన్ స్కాలర్‌షిప్ మీద యూరప్‌లో పైచదువులకు వెళ్ళి నెదర్లాండ్స్‌లో మెటలర్జీలో మాస్టర్స్, బెల్జియంలో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. తర్వాత నెదర్లాండ్స్‌లో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన పరిశ్రమల్లో, ముఖ్యంగా యూరేనియంపై, పనిచేశాడు. 1974లో భారతదేశం స్మైలింగ్ బుద్ధ పేరుతో అణు పరీక్ష జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది, పాకిస్తాన్‌ని భయాందోళనలకు గురిచేసింది. ఖాన్ పనిచేస్తున్న పరిశ్రమలు అణువిద్యుత్తును పుట్టించే సాంకేతికతకు సంబంధించినవి. అయితే, వాటిలో కొద్ది మార్పుచేర్పులు చేస్తే దానితోనే అణ్వాయుధాలూ రూపొందించవచ్చు. 1974-75ల్లో పాకిస్తాన్ ప్రధానిని రహస్యంగా కలిసి తన అనుభవాన్నీ, దానితో ఎలా తాను అణ్వాయుధాల రూపకల్పనలో సాయపడగలనన్నదీ చెప్పాడు. పాక్ ప్రధాని అతన్ని నెదర్లాండ్స్‌లోనే ఉండి ఇంకొంత సమాచారాన్ని రహస్యంగా సంపాదించమన్నారు. అలాగే ఉండి రహస్యంగా అవసరమైన సాంకేతికత, అనుభవం సంపాదించాడు. నెదర్లాండ్స్ కంపెనీకి అనుమానాలు వస్తున్న సమయానికి అక్కడ నుండి కుటుంబంతో సహా మాయమై పాకిస్తాన్ చేరుకున్నాడు.
ఆ తర్వాత పాకిస్తాన్ అణు కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనుకున్న ప్రణాళికలో వెనుకబడిపోయి అణు ఆయుధ సామర్థ్యం సాధించగలదా అన్న సందేహాల్లో ఉన్న ఆ ప్రాజెక్టుకు ఏక్యూ ఖాన్ చేరిక బలాన్నిచ్చింది. యూరోపియన్ దేశాల్లోని అత్యాధునికమైన న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ డిజైన్లను కాపీ చేసుకుని తీసుకువచ్చాడు. తనకున్న సర్కిల్ ద్వారా ఈ ప్రాజెక్టుకు కీలకమైన విడిభాగాలను స్మగుల్ చేసే నెట్‌వర్క్ ఏర్పాటుచేసుకున్నాడు. 1984 నాటికల్లా పాకిస్తాన్ అణు ఆయుధ సంపత్తి సాధించడంలోనూ, 1998లో పరీక్షించడంలోనూ విజయవంతమైంది. అత్యుత్సాహవంతుడు, ప్రచార కాంక్షకలవాడూ, స్వీయప్రతిభపై అపార విశ్వాసం కలిగినవాడూ అయిన ఖాన్ ప్రభుత్వ వర్గాల్లో చాలా విలువైన వ్యక్తిగానూ, పాకిస్తాన్ ప్రజల్లో అణు ఆయుధాలు సాధించి దేశాన్ని కాపాడిన హీరోగానూ పేరు గడించాడు. ఇందుకోసం బోలెడంత ప్రచారం చేసుకున్నాడు. సాటి సైంటిస్టుతో పేరు కోసం పోటీపడ్డాడు. దానితో సైంటిఫిక్ కమ్యూనిటీ మాత్రం షోమేన్ అని తిరస్కారంగా చూసేది.
ఏక్యూ ఖాన్ పాకిస్తాన్ కోసం తాను రూపొందించుకున్న న్యూక్లియర్ సాంకేతికతకు అవసరమైన విడిభాగాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను, తనకున్న డిజైన్ల అవగాహనను ఇతర దేశాలకు అమ్మకానికి పెట్టాడు. ఇరాన్ ఈ డిజైన్లను, విడిభాగాలను కొనుగోలు చేసుకుని, ఇతని సాయంతోనే న్యూక్లియర్ పవర్‌గా ఎదిగింది. లిబియాకు కూడా ఇలానే డిజైన్లు, విడిభాగాలు అమ్మాడు. ఇదంతా డబ్బు కోసమే చేశాడా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇందులో ఎంత పాత్ర ఉంది? వంటి సందేహాలు ఇప్పటికీ అలానే ఉండిపోయాయి. ఉత్తర కొరియా విషయానికి వస్తే చాలాసార్లు ప్రయాణించి అక్కడ క్షిపణులు, న్యూక్లియర్ బాంబుల తయారీకి సహాయం చేశాడని చెప్తారు. న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్‌లను పెద్ద సంఖ్యలో ఇచ్చాడని స్వయంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌యే అమెరికా ఒత్తిడి వల్ల ఒప్పుకున్నాడు. అయితే, పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రభుత్వమే దీనికి ఆదేశించిందని ఆరోపణలు ఉన్నాయి.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడుల తర్వాత పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా ఏక్యూ ఖాన్ మీద నిఘా పెంచింది. ఆ సమయానికి పాకిస్తాన్ ప్రభుత్వంలో సైంటిఫిక్ అడ్వైజర్ హోదాలో గౌరవాలను అనుభవిస్తున్నాడు ఖాదిర్ ఖాన్. అయితే, ఇప్పటిదాకా ఏక్యూ ఖాన్ ఏయే దేశాలకు ఈ టెక్నాలజీ అమ్మాడన్న విషయంలో మనం మాట్లాడుకున్న చాలా విషయాలు ఆ తర్వాతే బయటకు వచ్చాయి. 2003-04 ప్రాంతాల్లో అమెరికా ఒత్తిళ్ళకు లొంగి పాకిస్తాన్ ఖదీర్ ఖాన్‌ని పదవిలోంచి తొలగించింది. ఖాన్ టీవీలో పబ్లిక్‌గా తాను ప్రపంచంలో పలు దేశాలకు అణు సాంకేతికత అమ్మిన సంగతి ఒప్పుకున్నాడు. తర్వాత ప్రభుత్వం అతన్ని గృహనిర్బంధంలో పెట్టింది, జనాభిప్రాయానికి లొంగి పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాభిక్ష ఇచ్చింది. అతను ఏ దేశానికి ఏ టెక్నాలజీ స్మగుల్ చేసినా, దానివల్ల ప్రపంచ స్థితిగతులు ఎలా ఉన్నా సగటు పాకిస్తాన్ పౌరుడికి అతనంటే విపరీతమైన క్రేజ్. ప్రపంచ చరిత్రను ఇంతిలా మార్చేసిన ఖదీర్ ఖాన్ 2021 అక్టోబర్ 10న కోవిడ్-19 సోకి తగ్గిన తర్వాత ఆరోగ్యం క్షీణించి 85 ఏళ్ళ వయసులో మరణించాడు.