lifestyle

భారతీయులు ఎక్కువగా ఏ దేశంలో స్థిరపడుతున్నారో తెలుసా.? షాకింగ్ గణంకాలు..

ఉన్నత విద్య ఆ తర్వాత మంచి ఉద్యోగం.. ఆ తర్వాత అక్కడే స్థిర నివాసం. ఇదీ భారతీయుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్‌. భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వారు ఇప్పుడు అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఏకంగా 8 లక్షల 34 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అయితే భారతీయులు ఎక్కువగా ఏ దేశ పౌరసత్వం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా మారింది. అలాగే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో భారతీయులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారికి ముందు, 2011 నుంచి 2019 వరకు, ప్రతీ ఏటా సగటున 1,32,000 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని గణంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, 2020, 2023 మధ్య.. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం 20 శాతం పెరిగి రెండు లక్షలకు పైగా పెరిగింది. గత నెలలో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన భారతీయుల వలసల గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. 2023లో ఏకంగా 2.16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు.

in which country indians are settling mostly

ఇక 2022లో 2,25,620 మంది, 2021లో 1,63,370 మంది, 2020లో 85,256 మంది, 2019లో 1,44,017 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. మరి భారత పౌరసత్వం వదులుకుంటున్న వారు ఏ దేశంలో స్థిరపడుతున్నారో తెలుసా.? 2018 నుంచి 2023 వరకు భారతీయులు ఏకంగా 114 దేశాల్లో పౌరసత్వం పొందారు. అయితే అత్యధికులు మాత్రం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలలో స్థిరపడ్డారు. ఇదిలా ఉంటే గడిచిన 6 ఏళ్లలో 70 మంది పాకిస్థాన్‌ పౌరసత్వం తీసుకున్నారు. ఇక 130 మంది నేపాల్ పౌరసత్వాన్ని పొందగా, 1,500 మంది కెన్యా పౌరసత్వాన్ని ఎంచుకున్నారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వారిలో భారత విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. వీరిలో మెజారిటీ అమెరికా పౌరసత్వం పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Admin

Recent Posts