మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ లభిస్తున్నాయి కదా. మా ఆయిల్‌ను వాడితే జుట్టు చక్కగా పెరుగుతుంది… మా హెయిర్ ఆయిల్‌తో జుట్టు నల్లగా మారుతుంది… మా ఆయిల్‌తోనైతే బట్టతలపై కూడా జుట్టు మొలుస్తుంది… అని పలు కంపెనీలు తమ తమ హెయిర్ ఆయిల్స్ గురించి ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. అయితే ఇంతకీ నిజానికి ఆ ఆయిల్స్ కు అంతటి శక్తి ఉందంటారా..? నిజానికి సైన్స్ ఏమని చెబుతోంది..? ఇవే కాదు, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆముదం వంటి సహజ సిద్ధమైన ఆయిల్స్ రాసినా వెంట్రుకలు పెరిగే చాన్స్ ఉంటుందా..? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నూనెలు ఏవైనా అవి ఫ్యాటీ ఆమ్లాలు. తోకల లాంటి హైడ్రోకార్బన్ చివరన -COOH అనే కార్బాక్సిలిక్ సమూహం ఉండే సేంద్రియ అణువుల్ని ఫ్యాటీ ఆమ్లాలు అంటారు. వెంట్రుకలు కూడా సేంద్రియ బహ్వణువులు. వీటిలో కెరోటిన్ అనే ప్రొటీను శృంఖలాలు ఉంటాయి. నూనెలు, వెంట్రుకలు రెండూ సేంద్రియ పదార్థాలే కావడం వల్ల వెంట్రుకల జాలువారుడు, నునుపుదనం నూనెల పొరతో ఇనుమడిస్తాయి. కాబట్టి తలకు నూనెలు రాసుకోవడం శాస్త్రీయంగా మంచిదే. దీంతో వెంట్రుకలు ప్రకాశవంతంగా, నునుపుగా మారుతాయి. అయితే ఆయిల్స్ ఏవైనా వాటి వల్ల వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుందే కానీ, రాలిపోయిన వెంట్రుకలు మాత్రం పెరగవు. అలా పెంచే శక్తి ఆయిల్స్‌కు లేదు. వ్యక్తి వయస్సు, అతని జీన్స్ ఆధారంగా వెంట్రుకలు రాలిపోవడం, పెరగడం, బట్టతల రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకానీ వెంట్రుకలను పెరిగించే శక్తి ఆయిల్స్‌కు లేదు.
అయితే అన్ని ఆయిల్స్ కన్నా ఆముదం వాడితే వెంట్రుకలకు ఎంతగానో మేలు చేస్తుంది. ఎందుకంటే ఆముదం వెంట్రుకలకు ఎక్కువ సేపు పట్టుకుని ఉంటుంది. దీంతో వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. ఇతర ఆయిల్స్ కన్నా ఆముదం వాడితేనే జుట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మార్కెట్‌లో దొరికే ఆయిల్స్ కన్నా సహజ సిద్ధమైన ఆముదంను వెంట్రుకలకు పెట్టుకుంటే మంచిది..!