గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు.
ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు. మళ్లీ బైపాస్ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. గుండె కండరాలకు రక్తం సరిగా అందక ఛాతి నొప్పి (యాంజైన) వస్తుంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దవడ, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. వికారంగా, అలసటగా ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉంటుంది. గుండె జబ్బుకు ఆడ, మగ భేదాలు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది.
అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటుకు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చెమట పట్టడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు స్త్రీ పురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది. పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలోనూ అసౌకర్యం కలుగుతుందని తేలింది. తమకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బుకు చికిత్స ఆలస్యంగా మొదలెడతారు, దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది.