వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం మనం. కానీ నోటి అపరిశుభ్రతకూ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియ లేదు గానీ దీర్ఘకాల వాపు వంటి సమస్యలు ఇందుకు దోహదం పడతాయని భావిస్తున్నారు. చిగుళ్లు, దంతాల ఇన్‌ఫెక్షన్లు, వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా నోటి కణజాలాన్ని దాటుకొని రక్తం ద్వారా గుండె వంటి ఇతర భాగాలకు చేరుకునే ప్రమాదముంది. దీర్ఘ కాల చిగుళ్ల వాపు చిగుళ్ల కణజాలాన్నీ, దంతాలకు దన్నుగా నిల్చే ఎముకనూ దెబ్బతీస్తుంది. ఆ తరువాత ఒంట్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. రాను రాను ఇది గుండె మీదా ప్రభావం చూపుతుంది.

మధుమేహం నియంత్రణలో లేకపోతే లాలాజలంలోనూ గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇదీ నోట్లో ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. మధుమేహంతో లాలాజలం ప్రవహించటమూ నెమ్మదిస్తుంది. ఫలితంగా పళ్లు పుచ్చిపోవటం, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదమూ పెరుగుతుంది. నోరు మండటం, రుచి మారిపోవటం వంటివీ తలెత్తొచ్చు. నోటి అపరిశుభ్రత మూలంగా అల్జీమర్స్‌, డిమెన్షియా ముప్పు పెరుగుతున్నట్టూ ఫిన్‌లాండ్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో బయటపడింది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్ గలవారికి నోరు ఎండిపోయే ప్రమాదముంది. ఇది పిప్పిపళ్లు, చిగుళ్లజబ్బుకు దారితీయొచ్చు. చిగుళ్ల జబ్బు గలవారికి పార్కిన్సన్స్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వేళ్లు, చేతులు వణుకుతుండటం ప్రాధమిక లక్షణంగా చెప్పుకొనే పార్కిన్సన్స్‌కు వాడే కొన్ని మందులతో నోరు ఎండిపోవచ్చు. నియంత్రణలో లేని కదలికల మూలంగా దవడ నొప్పి, పళ్లు అరగటం, మింగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. చిగుళ్ల వ్యాధితో టైప్‌2 డయాబెటిస్‌కు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులకు కూడా సంబంధం ఉంటుంది.

if oral health is not good then it will effect on heart health

ఒంటరితనం వంటి కారణాలతో వృద్ధుల్లో చాలామంది డిప్రెషన్‌ బారినపడుతుంటారు. ఇలాంటివారికి పిప్పిపళ్లు, పళ్లూడటం వంటి సమస్యల ముప్పు ఎక్కువని పరిశోధనలు పేర్కొంటున్నాయి. సహజ దంతాలు లేకపోవటం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు. ఒకవేళ డిప్రెషన్ తగ్గించే మందులు వాడినట్టయితే నోరు ఎండిపోయే అవకాశమూ ఎక్కువవుతుంది. కొందరు విచారం, దిగులు నుంచి బయటపడటానికి పొగ తాగటం వంటివీ అలవాటు చేసుకుంటారు. ఇవీ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. మొత్తానికి నాలుకే కాదు మీ పళ్ళు కూడా మీ ఆరోగ్యాన్ని బయటపెడతాయి. అలాగే పరిశుభ్రమైన దంతాలు, చిగుళ్ళు మీ ఆరోగ్యాన్ని మరింత పాడవకుండా కాపాడతాయి కూడా.

Admin

Recent Posts