మందులను వేసుకోవడంలో చాలా మంది అనేక రకాల తప్పులను చేస్తుంటారు. కొందరు మందులను డాక్టర్ సలహా లేకుండా వేసుకుంటారు. కొందరు చాలా రోజుల పాటు ఉన్న మందులను ఎక్స్‌పైరీ తేదీ చూడకుండానే వేసుకుంటారు. కొద్ది రోజుల పాటు మాత్రమే వాడాలని డాక్టర్ చెప్పిన మందులను కొందరు చాలా రోజుల పాటు వేసుకుంటారు. ఇలా మందుల పరంగా చాలా మంది అనేక రకాల తప్పులను చేస్తుంటారు.
కంటిలో దుమ్ము, ధూళి పడిందని ఇంట్లో ఉన్న వాడేసిన పాత ఐ డ్రాప్స్ ( eye drops )ను కంటిలో వేసుకోకండి. అది కంటిచూపుపై తీవ్ర హానికర ప్రభావం చూపిస్తుంది.
వైద్యుల సూచన లేకుండా పరగడుపున పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు గాని, యాంటి బయాటిక్స్ గాని వాడకండి. వాటివల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఒంటి నొప్పులు అధికంగా ఉన్నాయని, టాబ్లెట్లను అధికంగా వాడితే.. అవి కిడ్నీలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. ఏ టాబ్లెట్స్ అయినా మంచినీటితోనే తీసుకోవాలి. కాఫీ, టీలతో, ఏ ఇతర పానీయాలతో తీసుకోకూడదు.