mythology

శ్రీ‌రాముడి కంటే కూడా రామ‌నామం గొప్ప‌ద‌ని అంటారు.. ఎందుక‌ని..?

సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి. లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది. రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది. దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు .

అందుకు రామ అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా! రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు అని రాముడిని ఆదేశించాడు.

lord sri rama name is great than rama know how

విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామ నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. రామ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? రామ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు.

ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం రామనామం.

Admin

Recent Posts