mythology

రామాయణంలో సీత గురించి చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేస్తారు.. కానీ ఆమె అలా కాదు..!

రామాయణం గురించి ఆలోచన రాగానే రాముడు, హనుమంతుడు, రావణుడు వంటి పాత్రలే గుర్తుకువస్తుంటాయి. ఏతావాతా సీతమ్మ తల్లి గుర్తుకువచ్చినా ఒక అబలగా, లక్షణరేఖను దాటిన వ్యక్తిగానే అభిప్రాయాలు ఏర్పడతాయి. రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో సీత కూడా అంతే ముఖ్యమన్న స్పృహ చాలా అరుదు. సినిమాల్లో అంజలీదేవిలాగానే సీతాదేవి కూడా నిరంతరం దుఃఖితురాలై ఉంటుందని ఓ అంచనా! నిజంగా అంతేనా..? రామ అన్న పేరులాగానే సీత అన్న పేరులో కూడా రెండక్షరాలే! తిరగేసి వల్లెవేస్తే అదే పేరు పదేపదే వినిపిస్తుంది. విచిత్రంగా సీత అన్న పేరు రామాయణానికి ముందే వచ్చిన వేదాలలో కూడా వినిపిస్తుంది. రుగ్వేదంలో వ్యవసాయానికి అధినేత్రిగా సీత అనే దేవత కనిపిస్తుంది. ఆ తరువాతకాలంలో జనకుడు భూమిని దున్నుతుండగా సీత దొరికిన విషయం తెలిసిందే! అందుకే సీత అన్న పదానికి నాగటిచాలు అన్న అర్థం కూడా వస్తుంది.

అంటే అనాదిగా మన పూర్వికులు భూమిలోని జీవానికి సీతమ్మ తల్లిని ఓ ప్రతిరూపంగా భావించేవారన్నమాట! రామాయణంలో సీత మహా సాదుజీవిగా కనిపిస్తుంది. కానీ అవసరం అనుకున్నప్పుడు ఆమె పట్టిన పట్టుని వీడకపోవడాన్ని గమనించవచ్చు. మహా బలశాలి అయిన రావణాసురుడు ఆమె చెంతకు చేరినప్పుడు…. అతను ఒక గడ్డిపోచతో సమానం అన్నట్లుగా ప్రవర్తించి అహాన్ని దెబ్బతీస్తుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అతనితో తిరిగివెళ్లే అవకాశం ఉన్నా కూడా… రాముడే వచ్చి రావణుని ఓడించి తనని చెర నుంచి విడిపించాలని కోరుతుంది. ఇంతకంటే బలమైన వ్యక్తిత్వాన్ని ఊహించగలమా! లక్ష్మణుడు గీసిన గీత దాటిందని సీతను వేలెత్తి చూపుతారు కొందరు. కానీ సీత గీత దాటకపోయి ఉంటే రావణుని సంహారమే జరిగి ఉండేది కాదు కదా! అయినా ఒకరు గీసిన గీత వెనకే ఉండిపోతే సీతకి సొంత వ్యక్తిత్వం ఉన్నట్లు ఎలా అవుతుంది?

many people will under estimate sitha in ramayan

సీత తను గీత దాటాలనుకుంది. దాటింది. అంతే! దాని తరువాత వచ్చే పర్యవసానాలకి ఆమె సిద్ధపడి ఉండవచ్చు. తనని ఎవరూ లోబరుచుకోలేరనో, ఎవరన్నా తనని హాని తలపెట్టినా భర్త రక్షిస్తాడనో… ఆమెకు నమ్మకం ఉండవచ్చు. సీత గర్భవతిగా ఉండగానే రాముడు ఆమెను అడవులకి పంపాడు. కానీ సీతమ్మ బేలగా మారి తన పుట్టింటికి చేరలేదు. బిడ్డలను కని అడవిలోనే పెంచి పెద్దచేసింది. వారు తండ్రిని సైతం ఎదుర్కొనే యోధులుగా తీర్చిదిద్దింది. ఆ పిల్లలని రాముడు కనుగొని వారిని ఆహ్వానించగానే, వారితో పాటు సీతాదేవి అయోధ్యకు బయల్దేరలేదు. తనని అనుమానించి అవమానకరంగా వెళ్లగొట్టిన అయోధ్యాపురికి ఆమె అలా చేరుకుంటే ఆమె గొప్పదనం ఏముంటుంది? అందుకే తన తల్లి భూదేవిలోకే వెళ్లిపోయేందుకు సీతాదేవి సిద్ధపడింది. అది ఆత్మహత్య కాదు- నిష్క్రమణ! నిరసన! అవతార సమాప్తి!

సీతాదేవి అబల కాదు… కారణజన్మురాలు అని కొన్ని కావ్యాలు పేర్కొంటున్నాయి. కుశధ్వజుడు అనే రుషి కుమార్తె అయిన వేదవతే తనతో అనుచితంగా ప్రవర్తించిన రావణాసురుని మీద పగతీర్చుకునేందుకు సీతగా జన్మించిందట! అంటే అమాయకంగా కనిపిస్తూనే అను అనుకున్నది సాధించిందన్నమాట సీతాదేవి. శివధనుస్సుని సైతం కదిలించగల బలవంతురాలు సీత. అందుకనే ఆ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగే వీరుడే ఆమెకు సాటి రాగలడంటూ స్వయంవరాన్ని ప్రకటించారు జనకుడు. మరి సీత బలహీనురాలు ఎలా అవుతుంది???

Admin

Recent Posts