భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు, ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్లే భార్య చేతుల మీదగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.
భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు. ఆమె లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం !! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు. నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ., ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు.
దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ? ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన.. నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ళ భరణి తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది..!