బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం గురించి మీకు తెలుసు కదా..! బల్లి మన శరీరంపై ఫలానా చోట, ఫలానా సమయంలో పడితే అదృష్టమో, దురదృష్టమో జరుగుతుందని, అలాగే ఫలానా చోట పుట్టు మచ్చ ఉంటే అదృష్టం కలసి వస్తుందని, లేదంటే రాదని… ఇలా ఆయా శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటిలాగే మరో శాస్త్రం కూడా వాడుకలో ఉంది. అదే కన్ను శాస్త్రం. అదే లెండి, కన్ను అదిరితే ఏం జరుగుతుందో చెప్పే శాస్త్రం. మన దగ్గరైతే మగవారికి కుడికన్ను అదిరితే మంచి జరుగుతుందని, అదే ఆడవారికైతే ఎడమకన్ను అదిరితే మంచి జరుగుతుందని చెబుతారు. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా విదేశాల్లోనూ కన్ను శాస్త్రం గురించి ప్రచారంలో ఉంది.
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటికి వస్తారని నమ్ముతారు. అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు. ఇక చైనీయులదైతే మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారు మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడికన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అయితే చైనీయులు ఇదే కాదు, కన్ను శాస్త్రంలో ఇంకాస్త ముందుకే వెళ్లారు. ఎలా అంటే వారు కుడి, ఎడమ కళ్లు ఏ సమయంలో అదిరితే ఎలాంటి ఫలితాలో కలుగుతాయోనని వివరిస్తూ ఏకంగా ఓ చార్ట్‌నే రూపొందించారు. వాటిలోని అంశాలివే. రాత్రి 11 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు: ఎడమ కన్ను అదిరితే ఎవరో గొప్ప వ్యక్తి ఇంటికి వస్తారు, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుంది. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు – ఎడమ కన్ను అయితే కంగారు పడేది ఏదో జరుగుతుంది, కుడి కన్ను అయితే ఎవరో మీ గురించి ఆలోచిస్తారు. తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల వరకు – ఎడమ కన్ను అయితే దగ్గర్లోని స్నేహితుడు ఇంటికి వస్తాడు, కుడి కన్ను అదిరితే ఏదైనా ఓ సంతోషకరమైన ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటారు.
ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే ఎవరో ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు, కుడి కన్ను అయితే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే దూరపు స్నేహితుడు మిమ్మల్ని కలిసేందుకు వస్తాడు, కుడి కన్ను అయితే మీకు ఏదో ఒక విధంగా దెబ్బ తగులుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే పార్టీలో పాల్గొంటారు, కుడి కన్ను అయితే ఎవరితోనైనా గొడవ పడతారు. ఉదయం 11 నుంచి మధ్యహ్నం 1 గంట మధ్య ఎడమ కన్ను అదిరితే మంచి పార్టీలో ఎంజాయ్ చేస్తారు, కుడి కన్ను అయితే ఏదో ఒక ఉపద్రవం ముంచుకు వస్తుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే మీరు అనుకున్న ప్లాన్స్ నెరవేరుతాయి, కుడి కన్ను అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే మీరు త్వరలో కొంత ధనం కోల్పోతారు, కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు.సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే ఎవరో ఒకరు మిమ్మల్ని కలుసుకునేందుకు వస్తారు, కుడి కన్ను అదిరితే మీరు దూరంగా ఉన్న ఎవరినో పరామర్శించేందుకు వెళ్తారు.
రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే ఎవరో ఒకరు మిమ్మల్ని కలుసుకునేందుకు వస్తారు, కుడి కన్ను అదిరితే మీరు ఏదో ఒక పెద్ద పార్టీకి వెళ్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని కలుస్తారు, కుడి కన్ను అదిరితే మీరు కోర్టుకు సంబంధించిన వివాదాల్లో ఇరుక్కుంటారు.అయితే కన్ను శాస్త్రం ప్రకారం ఎవరు ఏం చెప్పినా ఎక్కువ సేపు అలా కళ్లు అదురుతుంటే మాత్ర కచ్చితంగా మీకు ఏదో ఒక అశుభం కలుగుతందట. అయితే అది శాస్త్ర ప్రకారం కాదు, సైన్స్ ప్రకారం.
ఎందుకంటే ఒకటి రెండు సార్లు కళ్లు అదిరితే ఏమీ కాదు కానీ అదే సమస్య రెండు, మూడు రోజుల పాటు ఉంటే అప్పుడు మీకు వైద్య శాస్త్రం ప్రకారం మయోకైమియా వ్యాధి ఉన్నట్టే లెక్క. అంటే ఇది పెద్ద సమస్యే కాదు. మెగ్నిషియం వంటి మినరల్ లోపం కారణంగా ఈ వ్యాధి వచ్చి కళ్లు అలా అదురుతాయి. సరైన పోషకాహారం తీసుకుంటే దానంతట అదే ఈ సమస్య పోతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య తీవ్రతరమవుతుందట. అంతేకాదు, కేవలం పోషకాహార లోపం వల్లే కాకుండా, నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధ సమస్యలు ఉన్నా అలా కళ్లు అదురుతాయట. కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కళ్లు అలా అదురుతుంటే వెంటనే సంబంధిత వైద్యున్ని కలవడం ఉత్తమం. లేదంటే ఇంకా ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.