వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

అనగనగనగా ఒక గ్రామంలో అయలి అనే గ్రామదేవత ఉంది. ఆవిడ కన్య దేవత అవ్వటం చేత ఆ గుడిలోకి కేవలం వయసుకి రాని ఆడపిల్లలు మాత్రమే వెళ్తారు. పెళ్ళైన ఆడవారికీ, పురుషులకీ ప్రవేశం ఉండదు. పక్క ఊర్లో ఉండే ఒక అబ్బాయి, ఈ ఊర్లో అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసి గొడవలు జరుగుతుంటే ప్రాణాలు కాపాడుకోవాటినికి ఆ ప్రేమ జంట అక్కడినుండి పారిపోతారు. అలా అమ్మాయి ఊరి నుండి పారిపోయినప్పటినుండి ఆ ఊర్లో కరువూ, మసూచీ, ప్రాణాలు పోవడమూ, ఇలా అన్నీ అరిష్టాలు మొదలవుతాయి. ఇక అందరూ అమ్మవారికి కోపం వచ్చింది అని ఆ ఊర్లో నుండి కట్టుబట్టలతో వేరే ఊర్లకి మకాం మారుస్తారు. ఇదంతా ఆ అమ్మాయి పారిపోవటం వల్లనే జరిగింది కాబట్టి, ఇక నుండి మన ఊర్లో అమ్మాయిలు పెద్ద మనిషి అయిన వెంటనే పెళ్లి జరగాలి అని ఊరు సభ్యులు నిర్ణయించుకొని దానికి కట్టుబడి ఉంటారు.

ఇదంతా జరిగి ఐదు వందల ఏళ్లు అవుతున్నా కూడా 1990ల నాటికి కూడా ఆ ఊర్లో ఆచారం అలానే కొనసాగుతూ ఉంటుంది. అసలు ఆ ఊర్లో పదో తరగతి చదివిన అమ్మాయి ఒక్కరు కూడా లేరు. అందరూ పుష్పవతి అవ్వగానే పెళ్లి చేసుకొని ఇంటికి అంకితం అవుతారు. అప్పటినుండి ఇప్పటిదాకా ఎవరూ ముందుకి వచ్చి ప్రశ్నించింది లేదు. అలాంటి ఊర్లో ఒక అమ్మాయికి బాల్యంలోనే పెళ్లి చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోకూడదనీ, ఇలాంటి కట్టుబాట్లు వేరే ఊర్లలో ఏమి లేవు కదా, ఇప్పుడు కాలం మారిందనీ, తను చదువుకొని డాక్టర్ కావాలనీ కోరుకుంటుంది. అలాంటి మూఢనమ్మకాలు ఉన్న ఊరిలో ఆ అమ్మాయి ఏమి చేసింది? వాళ్ళ ఊర్లో పేరుకుపోయిన మూఢనమ్మకాలని ఎలా ఎదిరించింది? ఆ ఊరి పెద్దలు అసలు ఊరుకుంటారా? మగ జాతి అహం ఊరుకుంటుందా? మగవారిని ఎదిరించలేని ఆడవారికి ఆ చిన్న పిల్ల మాటలూ, చేష్టల వల్ల మార్పు వచ్చిందా? ఆ అమ్మాయి ఊరికి విరుద్ధంగా వెళ్తుంటే ఊర్లో అమ్మవారికి మళ్ళీ కోపం వచ్చి ఆ ఊరిని ఏం చేసింది? ఆ ఊరి ఆడవారికి స్వేచ్ఛ దొరికిందా లేదా?

ayali web series review zee 5 ott

జీ5 ఓటిటిలో గొప్ప కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందా అంటే, ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో ఈ ‘అయలి’ అనే నా అభిప్రాయం. మన సమాజంలో ఒకప్పటి ఆచారాలు ఎలా ఉండేవీ, వాటిని అదునుగా చేసుకొని ఎంతమంది వారి స్వార్దానికి ఉపయోగించుకున్నారూ, ఆడవారికి విద్య ఎంత అవసరం, వాటి కోసం ఎంత పోరాడాలో ఒక చిన్న పిల్ల పోరాడిన తీరు మనం అణిచివేస్తున్న వాటిని గుర్తుచేస్తుంది. ఈ మధ్య కాలంలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు అనగానే హీరోయిన్ కూడా హీరో లాగా ఫైట్స్ చేస్తుంది లేదా హీరో సపోర్ట్ తీసుకోని ముందుకెళ్తుంది అనే ధోరణి నుండి ఒంటరిగా సమస్యతో పోరాడటం అప్పుడప్పుడు విద్యాబాలన్ సినిమాలలో చూసేవాడినీ, మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న పిల్ల ఊర్లో ఆడవారితో కలిసి వందల సంవత్సరాలుగా పేరుకుపోయిన బంకని ఎలా కడిగి మెరిసేలా చేసిందో మీరు కూడా చూడండి.

Admin

Recent Posts