వినోదం

అప్ప‌ట్లో సినిమాల‌ను ఇలాంటి టాకీస్‌ల‌లోనే ప్ర‌దర్శించే వాళ్లు తెలుసా..?

ఇవాళంటే సినిమా హాళ్ళలో ఏసీ, కుషన్ సీట్లు, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. 35 సంవత్సరాల ముందు టూరింగ్ టాకీస్ లు ఉండేవి. వాటిని చూస్తే, మాకు అనిర్వచనీయమైన ఆనందం. ఎందుకంటే ఎన్నో సినిమాలు వాటిల్లో చూస్తూ పెరిగాం. ఏ సౌకర్యాలు లేకపోయినా అందులోనే ఆనందం వెతుక్కున్నాం. పెద్ద రేకుల షెడ్డు. ముందు వెనుక గోడలు. ముందు గోడలోనే ప్రొజెక్టర్, టికెట్ల బుకింగ్. వెనుక గోడకు వెల్లవేసేవారు. అదే మా ముద్దుల వెండితెర. మా ఊరికి దగ్గరలో ఆరవల్లిలో (సినీ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణా రెడ్డి, కె. అచ్చిరెడ్డి ల సొంతూరు) లక్ష్మీ టాకీస్ ఉండేది. ఇలాగే మా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో టూరింగ్ టాకీస్ లుండేవి. హాలుకు రెండు వైపులా గోడల బదులుగా దడులు కట్టేవారు. సగం నుంచి రేకుల వరకు బరకాలు కట్టేవారు. అందువల్ల చేతిలో డబ్బు లేకపోతే, హాలు దగ్గర్లో కూర్చుంటే.. సినిమా మొత్తం వినేయవచ్చు! బరకాలు చినిగిపోతే అందులోంచి బొమ్మలూ కనపడేవి.

రాత్రి ఏడింటికి మొదటి ఆట మొదలు అయ్యేది. టిక్కెట్లు ఇచ్చేముందు మైకులో దేవుడి పాట వినిపించేవారు. అదీ డబుల్ రికార్డు. పాట మా ఊరికి వినపడేది. రికార్డు మొదలవ్వగానే పరుగులు లంకించుకునేవాళ్ళం. పాట పూర్తయ్యాకా, గంట మోగేది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లి, స్తంభాలు అడ్డు రాకుండా కూర్చునే వాళ్ళం. నేల టికెట్ పావలా. మరో అణా అమ్మను బతిమాలి తెచ్చుకోవడం, వేరుశెనగ కాయలో, బఠాణీలో కొనుక్కుని అవి తింటూ సినిమా చూసేవాళ్ళం. నేల.. అంటే కటిక నేల కాదు. అడుగు లోతున ఇసుక ఉండేది. కాల్చిపారేసిన బీడీలు, చుట్టలు, సిగరెట్లు.. సమస్త చెత్త అక్కడే ఉండేది. సినిమా మొదలయ్యాకా హాలంతా పొగే. తెరపై మాత్రం పొగత్రాగరాదు స్లైడ్. దీనికితోడు ఒకరిపై ఒకరు కూర్చోవడం. దీనివల్ల హాలు వేడెక్కిపోయేది.

this is one of the oldest cinema talkies

తర్వాత బెంచి. అవీ పెర్మనెంటు కాదు. ప్రేక్షకుల కేరింతలకు అవి కదిలిపోయేవి. బెంచీ అర్ధ రూపాయి. సినిమా మొదలవ్వగానే నల్లులు వేట మొదలు పెడతాయి. మొదట పిక్కలు దగ్గర, తర్వాత వీపుపై ఇంజెక్షన్ చేసి..రక్త పరీక్షలు నిర్వహించేవి. ఆపై తరగతి కుర్చీ లేదా రిజర్వుడు. దీనికి రూపాయి. అక్కడ నల్లుల బాధ తక్కువే. కింద తరగతుల నుంచి వలస వెళ్లిన నల్లులు సీమాంతర ఉగ్రవాదం నిర్వహించేవి.. ఇలాంటి దాడి మీద ముళ్ళపూడి వెంకట రమణ ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు నవల్లో జోకు పేల్చారు. ఇద్దరు స్నేహితులు కుర్చీ టికెట్ తో సినిమాకెళ్లారు. యధాప్రకారం ఒకడ్ని నల్లులు కుట్టాయి. ఒరే! నల్లులు కుడుతున్నాయి.. అంటాడు. అవునా? ఓ పనిచెయ్యి. అగ్గిపుల్ల వెలిగించి, మన టికెట్ చూపించు. అవి వెళ్లిపోతాయి.. అన్నాడు. ఫ్రెండ్ అలాగే చేశాడు. నల్లులు సిగ్గుపడి, బెంచీల దగ్గరకు వెళ్లిపోయాయి.!!

ఇన్ని ఇబ్బందులు ఉన్నా తెరమీద ఏంటీవోడో, కాంతారావో యుద్ధం చేస్తోంటే సర్వం మరచిపోయి చూసేవాళ్ళం. రేలంగోడో, రమణా రెడ్డో, రాజబాబో, పద్మనాభమో, అంజిగాడో (హాస్యనటుడు బాలకృష్ణ )కనిపిస్తే పొట్ట చెక్కలయ్యేలా పడి పడి నవ్వుకునేవాళ్ళం. ఆ రోజులే వేరు.

Admin

Recent Posts