ఇప్పుడేదో మనం పెద్దయ్యాక క్రష్ అనే పదం వాడుతున్నాము గాని ఆ రోజుల్లో బడిలో మనకి నచ్చిన అమ్మాయితో ఎదురుగా నిలబడి చూడటానికి, ఏదోక రకంగా మాట్లాడటానికి, తనకి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. బడిలో సునీతని ప్రేమించాడు, దూరమైపోయింది. ఆ కోపాన్ని తండ్రి కష్టపడి చేసిన వినాయక విగ్రహం మీద చూపించి, తండ్రిని దూరం చేసుకుంటాడు. ఆ తండ్రి పాత్ర మరణం చూసే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది. వినాయకుడి మీద కోపంతో ఏసుప్రభువుని నమ్ముకుంటాడు. సుందరం కాస్త జోసెఫ్ గా మారతాడు. 23 ఏళ్ల వయసుకి వచ్చాక భార్గవిని ప్రేమిస్తాడు.
తన కోసం రౌడీగా ఉన్న అతను మారిపోయి మంచి ఉద్యోగ్యం చేసుకుంటే ఈలోగా అమ్మాయి వాళ్ళ నాన్నకి మతం అడ్డొచ్చి చనిపోతానని బెదిరించి బలవంతంగా అమ్మాయికి పెళ్లి చేసేస్తాడు. ఈసారి కూడా చర్చికి వెళ్లి బాధపడతాడు. 33 ఏళ్ల వయస్సులో ముస్లిం అమ్మాయి సలీమాతో పరిచయం, ప్రేమ, ఇంకో గంటలో పెళ్లి అనగా సలీమా మరణం. ఇక పెళ్లి లాంటి ఆలోచనలు లేకుండా నట్టుగాడు అని పిలిపించుకుంటూ అదే ఊరిలో ఉండిపోయిన రాజు మళ్లీ తన కార్యాలయంలో కొత్తగా వచ్చిన ఒరిస్సా మేడంతో చివరికి పెళ్లి. కథ కంచికి మనం ఇంటికి. కథగా చూసిన వాళ్లకి ఏముంది ఇందులో అనిపించవచ్చు. ఈ సినిమా గొప్పతనం కథనం.
కథలో ప్రేక్షకుడిని నిమగ్నమయ్యేలా నాలుగు పాత్రలలో ఏ ఒక్కటి కూడా బోర్ అనిపించేలా తీయకుండా నాలుగు జీవితాలు అన్నట్టు చివరిదాకా కుర్చోపెట్టగలగడం కూడా గొప్పే. ఏ వయస్సులోనైనా ప్రేమ ఉంటుంది అని సినిమాలో రాజు సుందరం అంత చక్కగా చెబితే ఏమీ లేకపోవటం ఏంటండి! కంచరపాలెం సినిమాలో జీవితం ఉంది, చాలా రోజులకి ఒక మంచి తెలుగు సినిమా చూసామే అన్న ఆనందం ఉంది. వీటన్నిటితో పాటు ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తోడుగా ఆశపాశం పాట ఉంది.