పచ్చని ఆకు కూరలు, కూరగాయలు ప్రతిరోజూ కొంటూ వుంటాం. అయితే రోజు గడిచే కొద్ది వీటిలోని పోషకాలు తరిగిపోతూంటాయి. మరి పోషకాలను తరిగిపోకుండా రోజుల తరబడి నిలువ చేయాలంటే రిఫ్రిజిరేటర్ లో వుంచినప్పటికి సాధ్యం కాదు. కనుక సహజంగా వాటి తాజా దనాన్ని కాపాడుతూ నిలువచేసి వాడుకోవడం ఎలానో కొన్ని చిట్కాలిస్తున్నాం పరిశీలించండి. కూరగాయలను ఒక పేపర్ టవల్ లో వుంచి దానిని ప్లాస్టిక్ బ్యాగులలో వుంచండి. ఆకు కూరలు గోంగూర, బచ్చలి, తోటకూర, మెంతికూర వంటివి రిఫ్రిజిరేటర్ లో వుంచండి. మీరు కూరలు వుంచే ప్లాస్టిక్ బ్యాగులకు కొన్ని రంధ్రాలు వుండి గాలి బయటకు లోపలికి చొరబడేలా చూడండి. దానితో కూరలు కుళ్ళి పోకుండా వుంటాయి.
రిఫ్రిజిరేటర్ లో వుంచిన ఆకు కూరలకు తడిగా వున్న పేపర్ టవల్ చుట్టండి. అలాగని బాగా తడిగా వున్న పేపర్ టవల్ ఉపయోగించకండి. వల వంటి ప్లాస్టిక్ బ్యాగులను వాడి కూడా కూరగాయలను తాజాగా వుంచవచ్చు. పచ్చని ఆకు కూరలను వాటి వేళ్ళు వంటివి కత్తిరించి బ్యాగులలో వుంచి రిఫ్రిజిరేటర్ లో వుంచండి. బచ్చలి, కొత్తిమీర వంటివి ఈ విధంగా చేయవచ్చు. కూరల వేళ్ళను లేదా కాండాలను బాగా కడగండి. కేరట్లు, ముల్లంగి ఇంకా తినదగిన కూరల వేళ్ళను కత్తిరించి నిలువ చేయండి. మీ ఫ్రిజ్ లోని మూతలేని డబ్బాలలో వుంచండి. ఈ రకంగా చేస్తే పోషక విలువలు పోకుండా అవి కర కర మంటూ వుంటాయి.
కూరలు తాజాగా వుండాలంటే, వాటిని పేపర్ టవల్ లో పెట్టి గాలి చొరని బ్యాగ్ లో వుంచండి. ఏ కూరగాయ అయినా రెండు రోజులలో వాడండి. కేరట్లు, కొత్తిమీర ఆకులు గాలి చొరని డబ్బాలో వుంచండి. అవి తాజాగా వుంటాయి. టమాటాలు, బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి రిఫ్రిజిరేటర్ లో వుంచకండి. అవి తాజాగా వుండవు. కూరగాయలను బాగా వేడితగిలే చోట లేదా నేరుగా ఎండపడే చోట వుంచకండి.