ప్రమాదాలనేవి మనకు చెప్పి రావు. అవి అనుకోకుండానే వస్తాయి. అది ఎలాంటి ప్రమాదమైనా కావచ్చు. దాని వల్ల మనకు ఆస్తినష్టంతోపాటు ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. అలాంటి ప్రమాదాల్లో విద్యుత్ షాక్‌లు కూడా ఒకటి. ఇంట్లోనే కాదు ఏ ప్రదేశంలోనైనా విద్యుత్ సరఫరా సరిగ్గా లేక అస్తవ్యస్తంగా ఉన్నా, వైరింగ్ బాగా లేకపోయినా, ఎర్తింగ్ సరిగ్గా చేయకున్నా, కరెంట్ ఎక్కువైనా, సరైన జాగ్రత్తలు పాటించకపోయినా విద్యుత్ షాక్ కొడుతుంది. దీంతో ఆ షాక్ బారిన పడ్డవారు తీవ్ర గాయాలకు గురవుతారు. ఎక్కువ సామర్థ్యం ఉన్న హై టెన్షన్ విద్యుత్ అయితే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. అయితే అంతటి పవర్‌ఫుల్ కరెంట్ కాకుండా ఓ మోస్తరు కరెంట్ షాక్‌కు గురై, అపాయంలో ఉన్నవారిని మనం రక్షించుకోవచ్చు. అందుకోసం కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరెంట్ షాక్ కొట్టిన వారిని వెంటనే పట్టుకోకూడదు. ఎందుకంటే వారిలో పెద్ద మొత్తంలో కరెంటు ప్రవహిస్తుంటుంది. ఇది వారిని పట్టుకున్న వారికి కూడా పాకేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు ఏదైనా విద్యుత్ వైర్‌ను, స్విచ్‌ను ఇంకా అలాగే పట్టుకుని షాక్‌కు గురవుతూ ఉంటే వారిని ముందుగా ఆ కరెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకోసం అథమ విద్యుత్ వాహకాలైన ఎండిపోయిన కర్రలు, గ్లాస్, రబ్బర్, ఆస్బెస్టాస్ వంటి వస్తువులను ఉపయోగించి కరెంట్ నుంచి బాధితులను వేరు చేయాలి. కరెంటు షాక్ వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న వారికి తక్షణమే వైద్య సహాయం అందితే వారిని రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఆంబులెన్సును పిలవాలి. లేదంటే వాహనంలో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. దీని వల్ల కరెంట్ షాక్ కొట్టిన వారికి అయిన గాయాలకు వెంటనే చికిత్స లభిస్తుంది. వారు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా ఉంటారు.
కరెంటు షాక్ కొట్టడం వల్ల బాగా కాలిపోయి గాయాలైతే ఆ ప్రదేశాల్లో చల్లని నీటితో కడగాలి. కరెంట్ షాక్ కొట్టిన వారు మూర్ఛ పోతుంటే వారిపై వేడిగా ఉండే బ్లాంకెట్ లేదా కోట్‌ను కప్పాలి. దీంతో వారి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. విద్యుత్ షాక్ కొట్టిన సందర్భంలో బాధిత వ్యక్తులకు శ్వాస సరిగ్గా ఆడకపోతే కృత్రిమ శ్వాసను నోటితో అందించాలి. ఈ క్రమంలో గుండెపై రెండు చేతులతో ఒత్తుతూ సీపీఆర్ కూడా చేయాలి. వెన్నెముకకు బాగా గాయాలైతే తల, మెడలను కదపకుండా ఉండేలా చూసుకోవాలి. దీంతో నష్టాన్ని కొద్దిగా నివారించవచ్చు. షాక్ కొట్టడం వల్ల గాయాలై రక్తస్రావం జరుగుతుంటే శుభ్రమైన గుడ్డతో గాయాలకు కట్టు కట్టాలి. దీంతో బ్లీడింగ్ ఆగుతుంది.