జంటలకు పెళ్లి అవుతుందంటే చాలు, ఇరు వర్గాల ఇండ్లలో హడావిడి నెలకొంటుంది. పెళ్లి జరగడానికి కొన్ని రోజులు ముందు మొదలుకొని పెళ్లి అయ్యాక మరికొన్ని రోజుల వరకు ఆ హడావిడి తగ్గదు. అయితే ఇతరుల మాటేమోగానీ పెళ్లయిన జంట మాత్రం కొన్ని నెలలకు కచ్చితంగా బరువు పెరుగుతారు. పెళ్లికి ముందు సన్నగా రివటలా ఉండే వారు కూడా పెళ్లయ్యాక బొద్దుగా, లావుగా తయారవుతారు. ఇక ముందు నుంచి లావుగా ఉన్నవారైతే చెప్పనక్కర్లేదు. వారు ఇంకా లావుగా మారుతారు. మరి అసలు ఇలా ఏ జంట అయినా పెళ్లి తరువాత లావుగా అవడానికి కారణాలు ఏముంటాయో మీకు తెలుసా..? అవే ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లికి ముందు చాలా కష్టపడి పనిచేసేవారు కూడా పెళ్లయ్యాక కొన్ని రోజులు మళ్లీ అలా పనిచేసేందుకు గ్యాప్ వస్తుంది. దీనికి తోడు పెళ్లయ్యాక ఉండే టెన్షన్స్ సరే సరి. దీంతో తిండి తినడం కూడా ఎక్కువ అవుతుంది. పనిచేయడం తగ్గుతుంది. ఓ రకంగా చెప్పాలంటే కొంత బద్దకం ఆవరిస్తుందన్నమాట. అందుకని పెళ్లయ్యాక లావుగా మారుతారు నూతన వధూవరులు. ఇక ఇందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే… పెళ్లికి ముందు ఒక్కరే ఉంటారు, పెళ్లయ్యాక ఇద్దరవుతారు. ఈ క్రమంలో ఆహారం విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. పెళ్లికి ముందు తమకు ఇష్టమైనవి తినేవారు కాస్తా పార్ట్‌నర్ కోసం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. దీనికి తోడు ఆహారం వృథాగా పారేయడం తగ్గుతుంది. దీంతో శరీరానికి అవసరం లేకున్నా ఆహారం వృథా అయిపోతుందన్న బెంగతో దాన్ని తినేస్తారు. అది శరీర బరువును పెంచుతుంది. ఇలా కూడా పెళ్లయ్యాక చాలా మంది లావు అవుతారు.
ఇక పెళ్లయ్యాక నూతన దంపతులు లావు అయ్యేందుకు మరో కారణం ఏమిటంటే… పెళ్లికి ముందు యువతి అయినా, యువకుడు అయినా జిమ్ చేసే అలవాటు ఉంటే ఆ అలవాటుకు కొంత బ్రేక్ పడుతుంది. బద్దకం ఆవరిస్తుంది. దీంతో వ్యాయామం చేయడం మానేస్తారు. మళ్లీ వ్యాయామం చేస్తే ఓకే. లేదంటే బరువు పెరుగుతారు. ఇది కూడా వారి అధిక బరువుకు కారణం. అయితే ఇక చివరిగా ఇంకో విషయం మనం తెలుసుకోవాలి. అదేమిటంటే… ప్రపంచంలో ఏ జంట పెళ్లి చేసుకున్నా ఆ సమయం తరువాత కొన్ని రోజులకు కచ్చితంగా 2 కిలోల బరువు పెరుగుతారట. అవును, మీరు విన్నది నిజమే. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టుల ప్రయోగంలో తేలిన నిజం. కాబట్టి తెలిసిందిగా… పెళ్లి తరువాత దంపతులు ఎందుకు లావవుతారో..! కనుక… ఊరికే తిని కూర్చోకూడదు. అది పెళ్లప్పుడు అయినా, ఇతర సమయాల్లో అయినా సరే. లేదంటే లావవుతారు..!