ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటే.. ఇల్లాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అంతేకాదు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి ఇంటికి ఇల్లాలి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇల్లును చూసి ఇల్లాలును చూడాలి అంటారు. అంతగా ఇంటికి.. ఇల్లాలికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. ప్రతిరోజూ ఓ స్పూన్ గసగసాలు నానబెట్టి.. మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి పాలలో కలిపి తాగాలి. దీంతో మంచి నిద్ర పడుతుంది. పిల్లలకు జలుబు వెంటనే తగ్గాలంటే.. తమలపాకును నలిపి అందులో నుంచి వచ్చిన రసానికి, కాస్త తేనె కలిపి ఇవ్వాలి. తుమ్ములు అధికంగా వచ్చినా.. కొత్తిమీరను నలిపి ఆ వాసనను పీల్చుకున్నా వెంటనే తగ్గిపోతాయి.
వాతపరమైన నొప్పులు ఏవైనా ఉంటే.. ప్రతిరోజు దాల్చిన చెక్క పొడిని.. గ్లాసు పాలలో కలిపి తాగాలి. పుండ్లు కొన్ని ఎంతకీ తగ్గవు. అది పిల్లలకు, లేదా పెద్దలకు అయినా.. ఇటువంటి పుండ్లకు సీతాఫలం ఆకులను నలిపి వాటిని కట్టుకడితే.. వారం రోజుల్లో పుండ్లు తగ్గిపోతాయి. ఇంగువ, హారతి కర్పూరాన్ని కంది గింజంత ఉండకట్టి రోజుకో ఉండ మింగితే.. ఉబ్బసం, ఆయాసం, గుండెదడ వంటివి తగ్గిపోతాయి. ఒకవేళ నోటిపూత మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. కరక్కాయను అరగతీసి.. ఆ గంధాన్ని పూతపై రాయాలి. కరుక్కాయ బెరడును చుర్ణం చేసి వేడినీటితో కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
వేరుశనగ నూనెను ఒంటికి మసాజ్ చేసుకుని.. వేడినీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. ఒంటి మీద ఏవైనా సెగ గడ్డలు ఏర్పడితే.. బియ్యం పిండిని నీటితో కలిపి కాస్త వేడి చేసి ఆ సెగ గడ్డ మీద పెడితే త్వరగా చితికిపోతుంది. కొబ్బరినూనెలో కర్పూరం బిళ్లను పొడిచేసి వేసి తలకు పెట్టుకుంటే తలపై దద్దుర్లు, దురదలు పోతాయి. పరగడుపున గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం, ఉప్పును కలిపి తాగితే బరువు తగ్గుతారు. గంధం చెక్కను అరగదీసి, ఆ పేస్ట్‌ను వాపులపై పెట్టుకుంటే తగ్గుముఖం పడతాయి. అలాగే కరక్కాయను బుగ్గన పెట్టుకుని ఉంటే పొడిదగ్గు సమస్య తగ్గుతుంది. ఆముదం నూనెను అరికాళ్లకు రుద్దుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. పనిచేసినపుడు వేలు తెగితే.. రక్తం ఆగడానికి పసుపు లేక కాఫీ పౌడర్ వేసినా.. వెంటనే రక్తం గడ్డకడుతుంది. అంతేకాదు, వెల్లుల్లి రసం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. అందుకే గాయాలు అయిన చోట వెల్లుల్లి రసం పూస్తే బ్యాక్టిరియా చేరదు.