ఒక మనిషికి, మరో మనిషికి మధ్య తేడా ఏముంటుంది? రంగు, ఎత్తు, బరువు, ఆకారం… ఇలా వివిధ రకాలైన అంశాల్లో తేడాలుంటాయి. దీంతోపాటు వేలిముద్రలు కూడా ఏ ఇద్దరికీ ఒకే రకంగా ఉండవు. ప్రతి మనిషికి ఇవి వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. అదే పుట్టుమచ్చ. వేలిముద్రల్లాగే ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ప్రకారమే ఆయా సర్టిఫికెట్లలో ధ్రువీకరణ కోసం ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలను గురించిన వివరాలను సేకరిస్తారు. అయితే అసలు ఈ పుట్టుమచ్చలు ఎలా ఏర్పడతాయి? తెలుసుకుందాం రండి.
మన చర్మం రంగుకు మెలనిన్ అనే ఓ రకమైన కెమికల్ కారణమవుతుందన్న విషయం తెలిసిందే. ఇది చర్మంపై పడే సూర్యకాంతిలోని హానికారక అతి నీలలోహిత కిరణాలను గ్రహించి మనల్ని రక్షిస్తుంది. అయితే మన శరీరంలో ఉండే మెలనోసైట్ అనే కొన్ని ప్రత్యేక కణాలు ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో మెలనిన్ చర్మం అంతటా ప్రవాహం అవుతుంది. తద్వారా బయటి చర్మం వైపు వచ్చి అక్కడి రంగుకు కారణమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెలనోసైట్ కణాలు కలసికట్టుగా పనిచేయడం వల్ల మెలనిన్ మరింత దట్టంగా ఏర్పడి ఒకే చోట మచ్చగా లేదా చుక్కగా కనిపిస్తుంది. అదే పుట్టుమచ్చగా మనకు దర్శనమిస్తుంది.
పుట్టుమచ్చలు కొంత మందికి తల్లి కడుపులో ఉండగానే ఏర్పడతాయి. మరికొందరికి పుట్టుక అనంతరం, ఇంకొందరికి యుక్త వయస్సులో అలా దాదాపు 20 ఏళ్లు వచ్చే వరకు ఎక్కడో ఒక చోట పుట్టు మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ పుట్టుమచ్చలు సాధారణంగా నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. అప్పుడప్పుడు పసుపు రంగుకు మారుతుంటాయి. ఒక్కోసారి సరిగ్గా కనిపించవు కూడా. శరీర ఆరోగ్య స్థితిని బట్టి కూడా ఇవి రంగులో మార్పును చూపెడుతుంటాయి.