సుస్తీ చేస్తే డాక్టర్ వద్దకు వెళ్లడం, లక్షణాలు చెప్పడం, ఆరోగ్య పరిస్థితిని వివరించడం, ఆయన ఇచ్చిన చిట్టీ పట్టుకుని మందులు కొనడం, మింగడం… ఇదీ అనారోగ్యం బారిన పడిన ఎవరైనా చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్టర్ రాసిన మందుల చిట్టీ (ప్రిస్క్రిప్షన్) విషయానికి వస్తే అందులో డాక్టర్లు రాసేది మనకు అస్సలు అర్థం కాదు. ఎంత సేపు ప్రయత్నించినా మనం వారు రాసిన పదాలను కనుక్కోలేం. కానీ ఫార్మసీలో మాత్రం చక చకా ఆ చిట్టీ చదివి మందులను ఇచ్చేస్తారు. అది ఎందుకంటే.. వారు కూడా అదే ఫీల్డ్ కాబట్టి, డాక్టర్ రాసిన రాతను సులభంగా అర్థం చేసుకుంటారు. అయితే మనకు మాత్రం అది సాధ్యం కాదు. కానీ హ్యాండ్ రైటింగ్ అర్థవంతంగా రాసే కొందరు డాక్టర్లు కూడా ఉంటారు లెండి. అది వేరే విషయం. కానీ మెజారిటీ డాక్టర్ల రాతను అర్థం చేసుకోవడం, వారు ఇచ్చే మందుల చిట్టీని చదవడం సాధారణ ప్రజలకు సాధ్యం కాదు. అయితే అసలు నిజానికి వారు అంత కఠినంగా ఉండేలా రాతను ఎందుకు రాస్తారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్లు అలా అర్థం కాకుండా ఎందుకు రాస్తారనే విషయంపై 3 కారణాలను చెప్పవచ్చు, అవేమిటంటే…
1. మనం అనుకుంటాం కానీ, నిజానికి మీకు తెలుసా… ఎంబీబీఎస్ చదవడం అంటే అంత ఆషామాషీ కాదు. ఆ కోర్సులో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అయితే విద్యార్థులు నిజంగా బాగా ఒత్తిడికి లోనవుతారు. ఎందుకంటే వారి పరీక్షల్లో అందరికీ ఉన్నట్టుగా ప్రశ్నలకు చాయిస్ ఉండదు. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందే. కానీ రాసేందుకు మాత్రం చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. దీనికి తోడు ఒక్కో ప్రశ్నకు చాంతాడంత సమాధానం రాయాల్సి వస్తుంది. అందులో మెడికల్ టెర్మినాలజీలో పదాలు ఉంటాయి కదా. కొన్నయితే చాలా పొడవైన పదాలు ఉంటాయి. మరి వాటిని గుర్తుంచుకుని అక్షర దోషాలు, వాక్య దోషాలు లేకుండా అంత పెద్ద సమాధానాన్ని అంత తక్కువ సమయంలో రాయడం అంటే మాటలు కాదు. కనుకనే వారు చాలా వరకు గొలుసుకట్టు రైటింగ్‌తో సమాధానాలు రాస్తారు. ఇక అదే ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి వారు ఎంబీబీఎస్ పూర్తి చేశాక కూడా ప్రాక్టీస్ సమయంలోనూ అలాగే ఇంగ్లిష్‌లో కలిపి రాస్తారు. కనుకనే ఆ రైటింగ్ అంత సులభంగా ఎవరికీ అర్థం కాదు.
2. ఇక డాక్టర్లు అలా రైటింగ్ రాయడానికి గల మరో కారణం ఏమిటంటే… వారు ఎంబీబీఎస్ పూర్తి చేసే చివరి సంవత్సరంలో హౌస్ సర్జన్‌గా ఏదైనా హాస్పిటల్‌లో పనిచేస్తారు కదా. అప్పుడు సీనియర్ డాక్టర్ల వెంట ఉండాలి. వారు చెప్పే నోట్స్ రాసుకోవాలి. దీనికి తోడు పేషెంట్ల రికార్డులను రాయాలి. ఇదంతా బాగా వేగంగా చేయాల్సి ఉంటుంది. కనుక వారు ఇంగ్లిష్ కలిపి రైటింగ్ రాస్తారు. నెమ్మదిగా అర్థమయ్యేలా రాయాలంటే వారికి కుదరదు. కాబట్టే వారు ఫాస్ట్‌గా పదాలను కలిపి రాస్తుంటారు. కనుకనే అది ప్రాక్టీస్ అయి తరువాత కూడా వారు అలాగే రాస్తారు.
3. డాక్టర్లు అలా అర్థం కాకుండా రాయడానికి గల మరో కారణం.. పేషెంట్లు. అవును, వారే. ఏంటీ అర్థం కాలేదా. ఏమీ లేదండీ… డాక్టర్ వద్దకు నిత్యం వందల సంఖ్యలో పేషెంట్లు వస్తారు కదా, మరి వారికి మందులు రాయాలంటే నెమ్మదిగా అర్థం అయ్యేలా రాస్తామంటే కుదరదు. వ్యవధి ఉండదు. ఎక్కువ మంది పేషెంట్లను చూడలేరు. కనుకనే వారు ప్రిస్క్రిప్షన్‌లో అలా ఫాస్ట్‌గా కలిపి రాత రాస్తారు. కాబట్టి తెలిసిందిగా డాక్టర్లు అలా అర్థం కాకుండా ఎందుకు రాస్తారో. కనుక వారు రాసే రైటింగ్‌ను ఎప్పుడూ తప్పు పట్టకండి.