చుండ్రు ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రతి రోజూ తలస్నానం చేస్తున్నా కొందరిల ఈ సమస్య తీరదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభాలు అంతగా కనిపించవు. ఈ చుండ్ర సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నల్ల దుస్తులు వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే.. నల్లు దుస్తులపై చుండ్రు పడితే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అది మనతో పాటు మన పక్కన కూర్చునే వారిని కూడా అసౌకర్యానికి గురి చేస్తుంది. అందులోనూ చలికాలం వచ్చిందంటే చుండ్రు సమస్య విపరీతమవుతుంది. మరికొందరిలో అయితే ఈ చుండ్రు సమస్య తీవ్రంగా ఉండి.. వారు నానా అవస్థలు పడుతుంటారు. ఈ చుండ్రు సమస్యకు అనేక రకాల చికిత్సలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ కావడంతో చాలా మంది వాటిని చేయించుకోవడానికి వెనుకాడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ చుండ్రు సమస్యను ఇంట్లోనే తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
చుండ్రు సమస్య సతాయించేదే అయినా.. దీనిని తగ్గించుకోవడం సులభమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ చిట్కాలను వినియోగించడం ద్వారా వారం రోజుల్లోనే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా.. టీ ట్రీ ఆయిల్: ఈ నూనెను వాడే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీనిని నేరుగా జుట్టుకు అప్లై చేయకూడదు. అలా చేస్తే పలు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ నూనెను మూడు నాలుగు చుక్కలు షాంపులో కలుపుకోవాలి. ఆ షాంపుతో ఎప్పటిలానే తలస్నానం చేసేయాలి. టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చుండ్రు సమస్యను చాలా వేగంగా తగ్గిస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్: చుండ్రు సమస్యను తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్‌ను సమపాలలో తీసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుపై స్ప్రే చేయాలి. అలా 15-20 నిమిషాల ఉంచి ఆ తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. నిమ్మరసం, కొబ్బరి నూనె: రెండు మూడు చెంచాల కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేసేయాలి. నిమ్మరసం ఫంగస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె మన తలకు కావాల్సిన తేమను అందిస్తుంది. ఇలా తరచూ చేయడం ద్వారా వారం రోజుల్లో చుండ్రు సమస్య సమసిపోతుంది.
కలబంద: కలబంద ముక్క ఒకటి తీసుకుని దాని గుజ్జును తలకు బాగా పట్టించాలి. ఒక 30 నిమిషాలు ఆగిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. కలబంద జుట్టుకు కావాల్సిన తేమను అందించడంతోపాటు ఫంగస్‌ను తగ్గించడమే కాకుండా జుట్టుకు కావాల్సిన మరెన్నో పోషకాలను కూడా అందిస్తుంది. మెంతులు, పెరుగు: రెండు చెంచాల మెంతులను తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌లో రెండు చెంచాల పెరుగు వేసు బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తనస్నానం చేసేయాలి. మెంతులు, పెరుగు రెండూ కూడా జుట్టును శుభ్రపరచడంతో పాటు చుండ్రు పొరను తొలగించడానికి బాగా పనిచేస్తాయి.