మీ బరువు నియంత్రణలో వుండాలంటే మీ ఆహారంలో ఏమేం చేర్చాలనేది మీకు తెలియాలి. వయసు వచ్చే కొద్దీ, మీ ఆహారంలో పీచు వుండటం ప్రధానం. వయసు పెరిగితే మెటబాలిక్ క్రియ అంటే చురుకుదనం నశిస్తూవుంటుంది. అటువంటపుడు మీరు తీసుకునే పీచు ఆహారం శరీరం సవ్యంగా పనిచేసేలా చేస్తుంది. అనారోగ్య సమస్యలు, గుండె, డయాబెటీస్ వంటివి రాకుండా మీ శరీరానికి సమస్య కలిగించే వ్యర్ధాలను బయటకు నెట్టివేయడానికి పీచు సహకరిస్తుంది.
మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కూడా వుంటాయి. మామిడిపండు టెంక చీకేయటం, మొక్కజొన్న కండె నమిలేయటం వంటివి ఫైబర్ లేదా పీచు అధికంగా ఇస్తాయి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా వుండే పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలవంటివి ఉడికించి తినండి. వాటిని బాగా నలగకొట్టి సూప్ కాచి తాగితే కావలసినంత ఫైబర్ శరీరానికి అందుతుంది.
ఆరెంజస్ లేదా కమలా పండ్లు తొక్క ఒలిచినప్పటికి తొనలను పై పొరలతో తింటే కావలసినంత పీచు పదార్ధం మీ శరీరంలో చేరినట్లే. పీచు అధికంగా వుండే గింజ ధాన్యాలు, బిస్కట్లు, మాల్ట్ వంటివి తినండి. గింజలు పొడి చేసి దోశలవంటివి కూడా ప్రత్యేకంగా తినవచ్చు. మాంసాహారం తగ్గించటం, తాజా కూరలు, పండ్లు, ఎండు ఫలాలవంటివి తినటం చేయాలి. పండ్లరసాలు, సలాడ్లు ఎంత బాగా తింటే అంత నాజూకుగాను, ఆరోగ్యంగాను తయారవుతారు.