శరీరంలోని జీవప్రక్రియల వల్ల ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు తయారవుతాయి. ఇవి అధికసంఖ్యలో ఉంటే కణాల పనితీరును దెబ్బతీసి అనారోగ్యం పాలు చేస్తాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, పార్కిన్సన్స్ మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి. ఇవి సహజ సిద్ధంగా కానీ, కృత్రిమంగా కానీ లభిస్తాయి.
ఆహార పదార్థాల ద్వారా లభించేవి సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు. రంగురంగుల పండ్లు, కూరగాయల్లో ఇవి అధిక మోతాదుల్లో ఉంటాయి. ముఖ్యంగా శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. తాజాపండ్లు సలాడ్లలో ఉండే విటమిన్- సి కూడా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. టమోటా, పుచ్చకాయల్లో అధికంగా ఉండే లైకోపిన్ మరొక యాంటీ ఆక్సిడెంట్. బియ్యం, గోధుమలు, పప్పులు లాంటి ధాన్యాల్లో ఉండే సెలీనియం అనే ఖనిజం కూడా యాంటీ ఆక్సిడెంటే.
ముదురు గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపండు రంగుల్లోని ఆహారంలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాలానుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు, ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కృత్రిమ యాంటీ ఆక్సిడెంట్లు తీసుకుంటే కొంత వరకు ఉపయోగం ఉన్నా సహజమైనవే మేలు. వైద్యుల సలహా లేకుండా మందుబిళ్లలు, సప్లిమెంట్ల రూపంలో వీటిని తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ.