సచిన్ టెండూల్కర్..! ఈ పేరు చెబితే చాలు, 140 కోట్ల మంది భారతీయులు ఒకేసారి సచిన్… సచిన్… అని అరిచినట్టు ఫీలింగ్ కలుగుతుంది. క్రికెట్ దేవుడిగా కొన్నేళ్ల పాటు క్రికెట్ ను ఏలిన చక్రవర్తిగా సచిన్ మన హృదయాల్లో నిలిచిపోయాడు. అతని ఆట అంటే మనకే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానులకు కూడా పండగే. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా సచిన్‌ను బాగా అభిమానిస్తారు. అంతలా సచిన్ అందరి మనస్సుల్లో నిలిచిపోయాడు. ఆ రోజున… అంటే.. నవంబర్ 16, 2013న సచిన్… క్రికెట్ మైదానానికి, ఆ ఆటకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన నాడు… మనందరి కళ్లు చెమర్చాయి. అయినప్పటికీ… ఇప్పటికీ సచిన్ అంటే క్రేజ్ అలాగే ఉంది. ఏ మాత్రం తగ్గలేదు. అయితే దాదాపుగా చాలా మంది క్రికెటర్ల లాగే సచిన్ కూడా అంజలిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంతకీ… సచిన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు జరిగిందో తెలుసా..?
అప్పుడు సచిన్‌కు 17 సంవత్సరాలు. అప్పటికే ప్రముఖ భారత క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. విదేశాలకు టూర్ వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన సచిన్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టులో అభిమానులు ఎగబడ్డారు. అయితే అదే సమయానికి అంజలి తన తల్లిని ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి వచ్చింది. అప్పటికి అంజలి వయస్సు 22 సంవత్సరాలు. ఈ క్రమంలో అంజలి సచిన్ ను మొదటిసారి ఎయిర్ పోర్టులో చూసి అప్పుడే అతని లవ్ లో పడిపోయింది. ఓ దశలో తన తల్లిని పికప్ చేసుకునే విషయం కూడా ఆమె మరిచిపోయింది. అలా వారిద్దరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగింది. అయితే ఆ తరువాత చాలా రోజులకు అంజలి మళ్లీ సచిన్ ను కలిసింది. అదీ… జర్నలిస్టు రూపంలో..!
ఓ యువతి నేరుగా సచిన్ ఇంటికి వచ్చి కలిస్తే అప్పుడది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. అదే ఓ జర్నలిస్టు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే… దాని గురించి ఎవరికీ అనుమానం రాదు. అదిగో అంజలి కూడా సరిగ్గా అదే పని చేసింది. సచిన్‌ను కలిసేందుకు జర్నలిస్టు అవతారం ఎత్తింది. అతని ఇంటికి జర్నలిస్టు రూపంలో వెళ్లి సచిన్‌ను ఎలాగో కలిసింది. అయితే ఈ విషయంపై ఇంట్లో ఎవరికీ అనుమానం కలగలేదు. కానీ… సోదరికి మాత్రం తెలిసిపోయింది. ఆ తరువాత 5 ఏళ్ల పాటు వీరు ప్రేమలో మునిగి తేలారు. అయితే ఓ సారి సినిమా చూసేందుకు సచిన్, అంజలి ఇద్దరూ కలిసి వెళ్లారు. అప్పటికే సచిన్‌కు ఎంతగానో పేరు రావడం వల్ల తనను బయట ఎవరైనా అలా అమ్మాయితో చూస్తే ఇంకేమైనా ఉందా..? అని భావించిన సచిన్ గడ్డం పెట్టుకుని, కళ్లకు చలువ అద్దాలు ధరించి అంజలితో కలిసి సినిమాకు వెళ్లాడు.
అది మణిరత్నం తీసిన రోజా సినిమా. ఈ క్రమంలో థియేటర్ నుంచి బయటికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా సచిన్ అద్దాలు కిందపడిపోయాయి. దీంతో అతన్ని చూసిన చుట్టు పక్కల వారు సచిన్ అని తెలుసుకున్నారు. ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అయితే అప్పటికి ఎలాగో సచిన్ తప్పించుకున్నాడు. కానీ అప్పటికే వారి లవ్ స్టోరీ గురించి అంతటా తెలిసిపోయింది. ఈ క్రమంలో వారు తమ తమ ఇండ్లలో కుటుంబ సభ్యులతో చెప్పి మే 24, 1995న పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి జరిగి 30 ఏళ్లు అవుతుంది.