పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు పదేళ్లు ముందే గుండె జబ్బులు వస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఐఐటి మద్రాస్ వారు 750 మంది ఇండియన్స్ మీద డిఎన్ఏ అనాలసిస్ చేయగా 40 నుంచి 45శాతం వారిలో గుండె జబ్బులకు కారణమయ్యే జెనెటిక్స్ ఉన్నాయని గుర్తించారు. నిజానికి ఒత్తిడి, నిద్ర లేకపోవడం రాత్రి 10 గంటల లోపు నిద్రపోకపోవడం వల్ల రక్తపోటు పెరిగి, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందట.
దీనివల్ల డిప్రెషన్ పెరిగిపోయి గుండె జబ్బులకు దారితీస్తాయని, ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి అనేది ఉంటుందని అంటున్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఏడుగురిలో ఒకరు ఒత్తిడి డిప్రెషన్ కు లోనవుతున్నారని, గుండె జబ్బులు రావడానికి నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్ కారణమైతే, మరొక విధంగా ఆహారం సరిగ్గా తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మనిషి వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలంటున్నారు. అంటే రోజుకు 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇండియాలో 50 శాతం మంది అసలు వ్యాయామమే చేయరని ఈ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఇండియన్స్ చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు.